Loading...
Tata Steel APL Apollo Tubes: టాటా స్టీల్ భారీ డీల్.. APL అపోలో ట్యూబ్స్‌లో 26.38% వాటా కొనుగోలు
టాటా స్టీల్ భారీ డీల్.. APL అపోలో ట్యూబ్స్‌లో 26.38% వాటా కొనుగోలు

Tata Steel APL Apollo Tubes: టాటా స్టీల్ భారీ డీల్.. APL అపోలో ట్యూబ్స్‌లో 26.38% వాటా కొనుగోలు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 23, 2026
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టీల్‌ రంగంలో టాటా స్టీల్‌ మరో భారీ అడుగు వేసింది. స్ట్రక్చరల్‌ స్టీల్‌ ట్యూబ్స్‌ తయారీ సంస్థ APL అపోలో ట్యూబ్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తం డీల్‌ విలువ రూ. 32,266 కోట్లు. S Gupta Holding Pvt Ltd.తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, APL అపోలో విస్తరించిన ఓటింగ్‌ షేర్‌ క్యాపిటల్‌లో 26.38 శాతం వాటాకు సమానమైన 7.38 కోట్ల షేర్లను టాటా స్టీల్‌ కొనుగోలు చేస్తుంది. ఒక్కో షేర్‌కు రూ. 2,100 చొప్పున ఈ కొనుగోలు జరగనుంది.

Details

మూడు దశల్లో పూర్తి కానున్న కొనుగోలు

ఈ వాటా కొనుగోలు ఒకేసారి కాకుండా మూడు దశల్లో పూర్తవుతుంది. తొలి దశలోనే 2.77 కోట్ల షేర్లను, అంటే 9.91 శాతం వాటాను, మార్కెట్‌లో బ్లాక్‌ డీల్‌ ద్వారా టాటా స్టీల్‌ కొనుగోలు చేసింది.

మిగిలిన 16.47 శాతం వాటాను రెండు దశల్లో తీసుకోనుంది. ఇందులో 11.9 శాతం వాటా అంటే 3.33 కోట్ల షేర్లు, మరో 4.57 శాతం అంటే 1.28 కోట్ల షేర్లు ఉన్నాయి.

ఈ రెండు లావాదేవీలు అవసరమైన అనుమతులు, ఇతర షరతులు పూర్తయితే 2028 మార్చి 31లోపు ఆఫ్‌-మార్కెట్‌ బదిలీల ద్వారా పూర్తవుతాయి.

Details

పబ్లిక్‌ షేర్‌హోల్డర్లకు ఓపెన్‌ ఆఫర్

ప్రమోటర్‌ వాటా కొనుగోలుతో పాటు APL అపోలో పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల కోసం టాటా స్టీల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

ఇందులో మరో 26 శాతం వాటాకు సమానమైన 7.28 కోట్ల షేర్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేర్‌కు రూ. 2,301.40 ఆఫర్‌ ధరగా నిర్ణయించింది.

ఆఫర్‌ పూర్తిగా అంగీకరించబడితే టాటా స్టీల్‌కు గరిష్ఠంగా రూ. 16,755.66 కోట్ల అదనపు వ్యయం అవుతుంది.

ఈ కొనుగోలు పూర్తయితే టాటా స్టీల్‌ వాటా మొత్తం 52.38 శాతానికి చేరి APL అపోలోకు కొత్త ప్రమోటర్‌గా మారుతుంది.

ADVERTISEMENT

Details

టాటా స్టీల్‌కు మార్కెట్‌లో మరింత బలం

ఈ డీల్‌తో అధిక మార్జిన్‌ వచ్చే విలువ ఆధారిత స్టీల్‌ ఉత్పత్తుల్లో టాటా స్టీల్‌ స్థానం మరింత బలపడనుంది.

APL అపోలోకు 14 బ్రాండ్లు, 5,000కు పైగా SKUలు ఉన్నాయి. FY26లో భారత్‌, UAE మార్కెట్లలో సంస్థ ఏకీకృత టర్నోవర్‌ రూ. 23,079 కోట్లుగా నమోదైంది.

డీల్‌ తర్వాత టాటా స్టీల్‌ డౌన్‌స్ట్రీమ్‌ ఇంటిగ్రేషన్‌ సుమారు 35 శాతం నుంచి 53 శాతానికి పెరగనుంది.

అంటే ముడి ఉక్కు నుంచి మరింత విలువ జోడించిన తుది ఉత్పత్తుల వరకు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ కొనుగోలు ఉపయోగపడనుంది.

ADVERTISEMENT