Tata Trusts: చంద్రశేఖరన్ పునర్నియామకం చెల్లదు: టాటా ట్రస్ట్స్ సంచలన ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను మరోసారి నియమించడంపై టాటా గ్రూప్‌లో వివాదం నెలకొంది. ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ కంపెనీలో మెజారిటీ వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదించిన తీర్మానం చట్టబద్ధంగా చెల్లదని, దానికి ఎలాంటి చెల్లుబాటు లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA) నిబంధనలను టాటా ట్రస్ట్స్ ప్రస్తావించింది. కంపెనీలో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్ నామినేట్ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు లేకుండా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. బోర్డులో ఉన్న ఇద్దరు ట్రస్ట్ నామినీలలో ఒకరు చంద్రశేఖరన్ నియామక తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపింది.
వివరాలు
న్యాయపోరాటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ నియామకం
దీంతో అవసరమైన మద్దతు లభించలేదని, తీర్మానం వీగిపోయినట్లేనని ట్రస్ట్స్ వాదించింది.
ఓట్లు సమానంగా వచ్చిన సందర్భంలో మాత్రమే చైర్మన్‌కు 'కాస్టింగ్ ఓటు'వేసే అధికారం ఉంటుందని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది.
అయితే ట్రస్ట్స్ నామినేట్ చేసిన డైరెక్టర్ల మద్దతుకు సంబంధించి ఉన్న ప్రత్యేక నిబంధనను కాస్టింగ్ ఓటు అధిగమించలేదని పేర్కొంది.
అందువల్ల చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని చైర్మన్ ఓటుతో చెల్లుబాటు చేయలేమని ట్రస్ట్స్ అభిప్రాయపడింది.
గతంలో జరిగిన టాటా-మిస్త్రీ కేసులో సుప్రీంకోర్టు తమ రక్షణ హక్కులను సమర్థించిన విషయాన్ని కూడా టాటా ట్రస్ట్స్ గుర్తుచేసింది.
ప్రస్తుత చైర్మన్ కంపెనీ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని అమలు చేస్తున్నారని ఆరోపించింది.
ఈ వివాదంపై న్యాయపోరాటం చేసేందుకు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని నియమించుకుంది.
వివరాలు
వాటాదారుల హక్కులను కాలరాయడం ప్రమాదకరమన్న సింఘ్వీ
వాటాదారులకు కల్పించిన ప్రాథమిక హక్కులను ఈ విధంగా బలహీనపరిస్తే, భారతదేశంలోని వందలాది కంపెనీల కార్పొరేట్ పాలనపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని సింఘ్వీ వ్యాఖ్యానించారు.
దీంతో చంద్రశేఖరన్ పునర్నియామకంపై టాటా గ్రూప్‌లో నెలకొన్న వివాదం మరోసారి న్యాయపరమైన అంశంగా మారింది.