Income tax duties:మరణంతో ఆదాయపు పన్ను బాధ్యతలు ముగియవు.. వారసులు ఏం చేయాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
వ్యక్తి మరణించినంత మాత్రాన ఆయనకు సంబంధించిన ఆదాయపు పన్ను వ్యవహారాలు ముగిసిపోవు. పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడం,పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వడం, బకాయి పన్నులను చెల్లించడం వంటి బాధ్యతలు కొనసాగుతాయి. అయితే, ఈ చెల్లింపులు సాధారణంగా మరణించిన వ్యక్తి వదిలి వెళ్లిన ఆస్తుల విలువ మేరకే ఉంటాయి. పన్ను చెల్లించాల్సిన ఆదాయం వచ్చినప్పటికీ రిటర్న్ దాఖలు చేయకుండానే వ్యక్తి మరణించిన సందర్భంలో చట్టపరమైన వారసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పన్ను విచారణలు, రీఅసెస్‌మెంట్ కేసులు లేదా చెల్లించని పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నా వాటిని పరిష్కరించాలి. అయితే కుటుంబంలో వారసత్వానికి సంబంధించిన వివాదాలు ఉంటే చట్టపరమైన వారసుడిని గుర్తించడం కొంత కష్టంగా మారవచ్చు.
వివరాలు
మరణించిన వ్యక్తి పెండింగ్ రిటర్నులు వారసులే దాఖలు చేయాలి
ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను పన్ను నిర్ధారణ అధికారి(Assessing Officer)కి వ్యక్తి మరణించిన విషయాన్ని తెలియజేయాలి.
చట్టపరమైన వారసుడు ఎవరూ లేకపోతే.. మరణించిన వ్యక్తి ఆస్తులను వారసత్వంగా పొందిన వ్యక్తిపై బాధ్యత పడుతుంది.
మరణించిన వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో మరణించే తేదీ వరకు సంపాదించిన ఆదాయానికి చట్టపరమైన ప్రతినిధి రిటర్న్ దాఖలు చేయాలి.
అంటే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచి వ్యక్తి మరణించిన తేదీ వరకు వచ్చిన ఆదాయాన్ని రిటర్న్‌లో చూపించాలి.
గత సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ దాఖలు చేయకుండా ఉంటే దానినీ సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు
చట్టపరమైన వారసుడిగా రిజిస్ట్రేషన్
చట్టపరమైన ప్రతినిధి ముందుగా ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో 'లీగల్ హెయిర్'గా నమోదు చేసుకోవాలి.
ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, మరణించిన వ్యక్తి, వారసుడి పాన్ వివరాలు సమర్పించాలి.
వీలునామా, వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా ఆదాయపు పన్ను పోర్టల్‌లో పేర్కొన్న అఫిడవిట్ వంటి పత్రాలను వారసత్వానికి ఆధారంగా ఇవ్వవచ్చు.
ఈ రిజిస్ట్రేషన్ అభ్యర్థనను అసెసింగ్ అధికారి లేదా సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ ఆమోదించాలి.
ఈ ఆమోదం వచ్చిన తర్వాత చట్టపరమైన వారసుడు మరణించిన వ్యక్తి తరఫున రిటర్న్ దాఖలు చేసి, దానిని ఆన్‌లైన్‌లో ధ్రువీకరించవచ్చు.
అయితే మరణం రిటర్న్ దాఖలు గడువుకు దగ్గరగా జరిగితే సకాలంలో రిటర్న్ సమర్పించడం కష్టమవుతుంది.
వివరాలు
చట్టపరమైన వారసుడిగా రిజిస్ట్రేషన్
అటువంటి సందర్భంలో ఆలస్యానికి సరైన కారణాన్ని వివరిస్తూ అదనపు సమయం కోరవచ్చు.
రిటర్న్ దాఖలు చేసే ముందు అన్ని ఆర్థిక వివరాలను పరిశీలించడం చాలా ముఖ్యం.
ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు స్టేట్‌మెంట్లు, మూలధన లాభాలకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిశీలించాలి.
వ్యక్తి మరణించిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని మాత్రం మరణించిన వ్యక్తి రిటర్న్‌లో చూపించకూడదు.
వివరాలు
ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి?
మరణించిన వ్యక్తి పేరుతో కొత్తగా ఆదాయపు పన్ను నోటీసు జారీ చేయడం చెల్లుబాటు కాకపోవచ్చు.
అలాంటి నోటీసును చట్టపరమైన ప్రతినిధి సవాలు చేయవచ్చు.
దానికి నేరుగా సమాధానం ఇవ్వడానికి బదులు నోటీసు చెల్లుబాటును ముందుగా పరిశీలించాలి.
లీగల్ హెయిర్ రిజిస్ట్రేషన్ ఆమోదమైన తర్వాత వచ్చిన లేదా పెండింగ్‌లో ఉన్న ప్రతి నోటీసును జాగ్రత్తగా పరిశీలించాలి.
నోటీసు రకం, తేదీ, ఎవరిని ఉద్దేశించి జారీ చేశారు, సమాధానం ఇవ్వాల్సిన గడువు వంటి వివరాలను తనిఖీ చేయాలి.
నోటీసు పరిశీలన, రీఅసెస్‌మెంట్, పన్ను డిమాండ్ లేదా సమాచారం కోరడానికి సంబంధించినదై ఉండొచ్చు. అందులో కోరిన పత్రాలను గడువులోగా సమర్పించి సమాధానం ఇవ్వాలి.
వివరాలు
ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి?
వ్యక్తి జీవించి ఉన్న సమయంలోనే ప్రారంభమైన కొన్ని పన్ను కేసులు ఆయన మరణం తర్వాత కూడా చట్టపరమైన ప్రతినిధిపై కొనసాగవచ్చు.
అందువల్ల నోటీసు ఎప్పుడు జారీ అయింది,కేసు ఎప్పుడు ప్రారంభమైంది, పన్ను శాఖకు వ్యక్తి మరణించిన విషయం ఎప్పుడు తెలిసింది వంటి అంశాలను పరిశీలించాలి.
సాధారణంగా చట్టపరమైన ప్రతినిధిపై పడే వ్యక్తిగత బాధ్యత మరణించిన వ్యక్తి వదిలి వెళ్లిన ఆస్తుల విలువను మించదు.
అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తులను జాగ్రత్తగా నిర్వహించాలి.
పన్ను బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంటే.. ఆస్తులను ఇతరులకు పంచడం,బదిలీ చేయడం, అమ్మడం లేదా తనఖా పెట్టడం వంటివి చేయకూడదు.
పన్ను బకాయిలు ఉన్నప్పుడు ఆస్తులను విక్రయించడం,బదిలీ చేయడం లేదా పంచడం వల్ల వారసులపై వ్యక్తిగత బాధ్యత రావచ్చు.
వివరాలు
ఐటీ నోటీసులు వస్తే ఏం చేయాలి?
అయితే ఆ బాధ్యత వారు అలా నిర్వహించిన ఆస్తుల విలువను మించదు.
అందువల్ల చట్టపరమైన వారసులు ముందుగా పూర్తి వివరాలను సేకరించి, ఆ తర్వాతే పన్ను శాఖ నోటీసులకు ఎలా స్పందించాలో నిర్ణయించుకోవాలి.
పన్ను కేసు వ్యక్తి మరణానికి ముందు ప్రారంభమైందా, ఆ తర్వాత ప్రారంభమైందా, అధికారులకు మరణించిన విషయం తెలుసా అనే అంశాలను నిర్ధారించుకోవాలి.
సకాలంలో లీగల్ హెయిర్‌గా నమోదు చేసుకోవడం, పెండింగ్ రిటర్నులు-నోటీసులను పరిశీలించడం, పన్ను బకాయిలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆస్తులను జాగ్రత్తగా ఉంచడం ద్వారా భవిష్యత్తులో అనవసరమైన సమస్యలను తగ్గించుకోవచ్చు.