TCS: టీసీఎస్ ఉద్యోగులకు నిరాశ.. క్యూ1 బోనస్‌లో కోత
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో కొంతకాలంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత ఒకటి, రెండేళ్లుగా పలు సంస్థల్లో లేఆఫ్స్ చోటుచేసుకుంటుండగా.. కొత్త నియామకాలు కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వేతనాల పెంపుపైనా ఉద్యోగుల్లో పెద్దగా ఆశలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగం కొనసాగుతుందనే భరోసా కూడా చాలామందిలో తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో టీసీఎస్ త్రైమాసిక ప్రాతిపదికన అందించే పనితీరు ఆధారిత వేరియబుల్ పేలో కోత విధించినట్లు సమాచారం.
వివరాలు
మిడ్, సీనియర్ ఉద్యోగులకు తగ్గిన బోనస్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు చెల్లించే పనితీరు ఆధారిత వేరియబుల్ పేను టీసీఎస్ తగ్గించింది.
ఈ ఉద్యోగులకు సగటున 60-70 శాతం వరకు బోనస్ అందినట్లు తెలుస్తోంది.
కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై భారీగా దృష్టి సారించి పెట్టుబడులు పెడుతున్న పరిస్థితులు, మరోవైపు ఆపరేటింగ్ మార్జిన్లపై ఒత్తిడి ఉండటం వంటి అంశాలు బోనస్ తగ్గింపునకు కారణాలుగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ మనీ కంట్రోల్ నివేదించింది.
వివరాలు
గత రెండు త్రైమాసికాలతో పోలిస్తే తగ్గింపు
తాజాగా లభించిన సగటు 70 శాతం వరకు ఉన్న వేరియబుల్ పే.. గత రెండు త్రైమాసికాల్లో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు అందిన బోనస్ కంటే తక్కువ.
ఆ రెండు త్రైమాసికాల్లో ఈ ఉద్యోగులకు సగటున 80 శాతం వరకు వేరియబుల్ పే చెల్లించినట్లు సమాచారం.
అయితే రెండేళ్ల క్రితం పరిస్థితితో పోలిస్తే ప్రస్తుత బోనస్ స్థాయి మెరుగ్గానే ఉందని తెలుస్తోంది.
అప్పట్లో ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఐటీ సేవలకు డిమాండ్ తగ్గింది.
దీంతో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు సగటున 20-40 శాతం వరకు మాత్రమే త్రైమాసిక బోనస్ లభించింది.
వివరాలు
జూనియర్లకు మాత్రం 100 శాతం వరకు
మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగుల వేరియబుల్ పే తగ్గినప్పటికీ.. టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య పరంగా ఎక్కువగా ఉన్న జూనియర్ స్థాయి సిబ్బందికి మాత్రం సగటున 100 శాతం వరకు త్రైమాసిక బోనస్ అందుతున్నట్లు సమాచారం.
అంటే వారి పనితీరు ఆధారిత చెల్లింపుల్లో ఈసారి పెద్దగా కోత కనిపించలేదని తెలుస్తోంది.
అయితే వేరియబుల్ పే చెల్లింపులపై టీసీఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
వివరాలు
ఏప్రిల్ నుంచే వేతనాల పెంపు
ఇదిలా ఉండగా.. ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేసినట్లు టీసీఎస్ ప్రకటించింది.
2026 ఏప్రిల్ 1 నుంచి ఈ జీతాల పెంపు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
ఇక మరో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయానికి వస్తే.. ఉద్యోగులకు త్వరలో రెండు దశల్లో ఇంక్రిమెంట్లు ఉండొచ్చని పేర్కొంది.
ఆ సంస్థలో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వేరియబుల్ పే సగటున 70 శాతం వరకు ఉన్నట్లు సమాచారం.
ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఇన్ఫోసిస్‌లోనూ బోనస్ చెల్లింపులు తగ్గినట్లు తెలుస్తోంది.