TCS Q4 Results: Q4లో అదరగొట్టిన TCS.. 12% పెరిగిన లాభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మంచి ప్రదర్శన చూపించింది. ఈ కాలానికి కంపెనీ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే లాభం 12.22 శాతం పెరగడం విశేషం. గతేడాది మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.12,224 కోట్ల లాభం నమోదు చేయగా, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10,657 కోట్లుగా ఉంది. పూర్తి 2025-26 ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ రూ.49,210 కోట్ల నికర లాభాన్ని సాధించింది.
వివరాలు
ఆదాయం పెరుగుదల
సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9.64 శాతం పెరిగింది. రూ.64,479 కోట్ల నుంచి రూ.70,698 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం 4.58 శాతం వృద్ధితో రూ.2.67 లక్షల కోట్లుగా నమోదైంది.
వివరాలు
డివిడెండ్, భారీ ఒప్పందాలు
ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్‌ను ప్రకటించింది. త్రైమాసికంలో 12 బిలియన్ డాలర్ల విలువైన పెద్ద ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సీఈఓ K Krithivasan తెలిపారు. కృత్రిమ మేధ (AI) సేవల ద్వారా వచ్చే వార్షిక ఆదాయం 2.3 బిలియన్ డాలర్లను దాటినట్లు వెల్లడించారు. నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికరంగా 2,000 మందికి పైగా ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కు పెరిగింది. అయితే అట్రిషన్ రేటు స్వల్పంగా పెరిగి 13.7 శాతానికి చేరింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో BSEలో టీసీఎస్ షేరు 1.09 శాతం లాభంతో రూ.2,587.75 వద్ద ముగిసింది.