LOADING...
TCS: విదేశీ ప్రయాణాలు, చదువులకు టీసీఎస్‌ రేటు తగ్గింపు
విదేశీ ప్రయాణాలు, చదువులకు టీసీఎస్‌ రేటు తగ్గింపు

TCS: విదేశీ ప్రయాణాలు, చదువులకు టీసీఎస్‌ రేటు తగ్గింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ పర్యటనలకు వెళ్లే వారికి, అలాగే ఇతర దేశాల్లో చదువుకునే పిల్లలకు నిధులు పంపే తల్లిదండ్రులకు కేంద్ర బడ్జెట్‌ కీలక ఊరటనిచ్చింది. విదేశీ ప్రయాణాలు, విద్య, వైద్య అవసరాల కోసం వినియోగించే మొత్తాలపై లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద వసూలు చేసే మూలం వద్ద పన్ను (టీసీఎస్‌) రేట్లను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. విద్య, వైద్య అవసరాల విషయానికి వస్తే.. విదేశాల్లో చదువుకోవడం లేదా వైద్య చికిత్స కోసం రూ.10 లక్షలకు మించి నిధులు పంపితే ప్రస్తుతం 5 శాతం టీసీఎస్‌ వసూలు చేస్తున్నారు. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం ఈ టీసీఎస్‌ రేటును 2 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Details

కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

ఇక విదేశీ పర్యటనల విషయంలోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు విదేశీ టూర్‌ ప్యాకేజీలకు సంబంధించి రూ.10 లక్షల వరకు 5 శాతం, ఆ మొత్తాన్ని మించితే 20 శాతం టీసీఎస్‌ వసూలు చేస్తున్నారు. ఇకపై టూర్‌ ప్యాకేజీ విలువ ఎంత అనే పరిమితితో సంబంధం లేకుండా, అన్ని విదేశీ టూర్‌ ప్యాకేజీలపై టీసీఎస్‌ రేటును ఏకరీతిగా 2 శాతానికి తగ్గించారు. అయితే విద్య, వైద్యం మినహా ఇతర అవసరాల కోసం విదేశాలకు పంపే నిధులపై ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం టీసీఎస్‌ రేటును యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Details

టీసీఎస్‌ రేటు 2శాతానికి తగ్గింపు

ఇదిలా ఉండగా.. వ్యాపార లావాదేవీల్లోనూ టీసీఎస్‌ను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. మద్యం, తుక్కు, ఖనిజాల విక్రేతలపై టీసీఎస్‌ రేటును 2 శాతానికి తగ్గించింది. అలాగే తునికాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 5 శాతం టీసీఎస్‌ను కూడా 2 శాతానికి తగ్గిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Advertisement