Tech Layoffs: ఒరాకిల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. టెక్ దిగ్గజాల్లో లేఆఫ్‌ల కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత కొనసాగుతోంది. సాధారణంగా సాంకేతిక సంస్థల్లో లేఆఫ్‌లు కనిపిస్తుంటాయి. అయితే ప్రస్తుతం దిగ్గజ కంపెనీలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటం ఆందోళనకు కారణమవుతోంది. ముఖ్యంగా అమెరికాలో అధిక వేతనాలతో పనిచేసిన ఉద్యోగులు సైతం లేఆఫ్ తర్వాత వెంటనే మరో ఉద్యోగాన్ని సంపాదించలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ట్రూఅప్ సంస్థ గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 1,75,000కుపైగా టెక్ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 2025లో ఏకంగా 2,45,000కుపైగా టెక్ ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ వంటివి ఈ ఉద్యోగాల కోతలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
వివరాలు
ఇవీ ఉద్యోగాల కోతకు కారణాలు
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌లకు కేవలం ఏఐ ఒక్కటే కారణం కాదు. ఐటీ సేవలకు డిమాండ్ తగ్గడం, సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడం, కొన్ని విభాగాల్లో ఆశించిన స్థాయిలో పనితీరు లేకపోవడం వంటి అంశాలు కూడా ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయి.
అదే సమయంలో కొత్త సాంకేతికతలపై, ముఖ్యంగా కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై పెట్టుబడులను పెంచేందుకు కొన్ని సంస్థలు ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తున్నాయి.
అంటే.. భవిష్యత్ టెక్నాలజీలపై నిధులను మళ్లించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించే వ్యూహాన్ని కూడా కొన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి.
వివరాలు
ఒరాకిల్‌లో 21 వేల ఉద్యోగాల కోత
భారీ స్థాయిలో ఉద్యోగులను తగ్గించిన టెక్ సంస్థల్లో ఒరాకిల్ ఒకటిగా నిలిచింది.
గత ఏడాది కాలంలో ఆ సంస్థ సుమారు 21,000 ఉద్యోగాలపై కోత విధించింది.
ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 13 శాతానికి సమానం.
మరోవైపు ఆపిల్ కూడా ఈనెలలో విజన్ ప్రో హెడ్‌సెట్‌ను రూపొందించిన విజన్ గ్రూప్‌లో కనీసం 60 మంది ఉద్యోగులను తొలగించింది.
మైక్రోసాఫ్ట్ గత నెలలో 4,800 మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఎక్స్‌బాక్స్ విభాగంలో 3,200 మంది ఉద్యోగులను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తొలగించనున్నట్లు సమాచారం.
వీసా సంస్థ కూడా తన మొత్తం సిబ్బందిలో దాదాపు 7 శాతానికి సమానమైన సుమారు 2,600 ఉద్యోగాలను తగ్గిస్తోంది.
వివరాలు
టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్‌లపై ప్రభావం
ఈ ఉద్యోగాల కోతలు ప్రధానంగా టెక్నాలజీ, ప్రొడక్ట్ టీమ్‌లపై ప్రభావం చూపుతున్నాయి.
ఉబర్ సంస్థ తన కస్టమర్ సర్వీస్ విభాగంలో దాదాపు 10 శాతం మంది ఉద్యోగులను, అంటే సుమారు 3,400 మందిని తగ్గించినట్లు సమాచారం.
అమెజాన్ కూడా తన ఏఐ విభాగంలో ఉద్యోగాల సంఖ్యను తగ్గించే చర్యలు చేపడుతోంది.
ఇదిలా ఉండగా.. ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి 7,000 నుంచి 10,000 వరకు ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్నాయి.
వివరాలు
అధిక వేతనాలు అందుకున్నవారికీ తప్పని కష్టాలు
అమెరికాలో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో ఏడాదికి 2 లక్షల డాలర్ల వేతనంతో పనిచేసిన సీనియర్ స్థాయి ఉద్యోగులు కూడా లేఆఫ్ తర్వాత కొత్త ఉద్యోగం దొరకడం కష్టంగా ఉందని చెబుతున్నారు.
ఒకప్పుడు భారీ వేతనాలు అందుకున్నప్పటికీ.. ఉద్యోగం కోల్పోయిన తర్వాత తమ అనుభవానికి సరిపోయే ప్రత్యామ్నాయ అవకాశాలు వెంటనే లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగం కోల్పోవడం తమ కెరీర్ దిశనే పూర్తిగా మార్చేసిందని పలువురు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని వివరిస్తున్నారు.
వివరాలు
అధిక వేతనాలు అందుకున్నవారికీ తప్పని కష్టాలు
ఉద్యోగ సంస్థ ద్వారా లభించే ఆరోగ్య బీమా కూడా కోల్పోవడంతో కుటుంబానికి వైద్య బీమా కొనసాగించేందుకు నెలకు సుమారు 2,600 డాలర్లు చెల్లించాల్సి వస్తోందని ఓ బాధితుడు తెలిపారు.
ఈ పరిస్థితుల్లో కొందరు తమకంటూ వ్యక్తిగత బ్రాండ్‌ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరికొందరు కన్సల్టింగ్ వ్యాపారాలను ప్రారంభిస్తుండగా.. ఇంకొందరు స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏఐ, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, ఖర్చుల నియంత్రణ వంటి కారణాలతో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతుండటంతో, అనుభవజ్ఞులైన ఉద్యోగులకు సైతం కొత్త ఉపాధి అవకాశాలు సవాల్‌గా మారుతున్నాయి.