Chinese loans: చైనా అప్పులు ఎక్కువగా తీసుకున్నది అమెరికానే! సంచలనం రేపుతున్న కొత్త రిపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ ఫైనాన్స్ రంగంలో ఎవరు ఊహించని విధంగా ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. కొత్త రిపోర్ట్ ప్రకారం, గత ఇరవై ఐదు ఏళ్లుగా చైనా ప్రభుత్వ సంస్థల నుంచి అత్యధిక రుణాలు తీసుకున్న దేశం అమెరికానే అని బయటపడింది. సాధారణంగా "బెల్ట్ అండ్ రోడ్" (BRI) ప్రాజెక్టులతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనా ఎక్కువగా అప్పులు ఇస్తుందని భావించేవారు. కానీ ఈ కొత్త అధ్యయనం ఆ అర్థాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. విలియం అండ్ మేరీ కాలేజ్‌కు చెందిన AidData అనే రీసెర్చ్ ల్యాబ్ విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో 2000-2023 మధ్య చైనా ప్రపంచంలోని 200 దేశాలకు ఇచ్చిన రుణాలు,గ్రాంట్లు కలిపి దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్టు వెల్లడించింది.
వివరాలు
ధనిక దేశాలకు ఇచ్చే రుణాలు ఇప్పుడు మూడు-వంతులు
ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అమెరికా మాత్రమే 200 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు తీసుకుని,దాదాపు 2,500 ప్రాజెక్టులు అమలు చేసింది. ఇతర దేశాలకు చైనా అప్పులు ప్రమాదకరమని హెచ్చరిస్తూ.. తానే అత్యధిక రుణాలు తీసుకున్న దేశంగా బయటపడటం ఐరోనిక్‌గా మారింది. ఈ అధ్యయనం ప్రకారం చైనా ఇప్పుడు తన రుణ విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే రుణాలు తగ్గి,పై స్థాయి ఆదాయం ఉన్న దేశాలకు అంటే ధనిక దేశాలకు ఇచ్చే రుణాలు ఇప్పుడు మూడు-వంతులు దాటాయి. AidData ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రాడ్ పార్క్స్ ప్రకారం,ఈ రుణాలు "క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,కీలక ఖనిజాలు,సెమీకండక్టర్ కంపెనీలు వంటి హైటెక్ ఆస్తుల కొనుగోలు"ల కోసం అత్యంత వ్యూహాత్మకంగా ఇస్తున్నారని తెలిపారు.
వివరాలు
అమెరికాలో దాదాపు ప్రతి రాష్ట్రం,రంగంలో చైనా పెట్టుబడి పెట్టినట్టు రిపోర్ట్
అమెరికాలో దాదాపు ప్రతి రాష్ట్రం,రంగంలో చైనా మద్దతుతో జరిగే కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. టెక్సాస్,లూయిజియానా రాష్ట్రాల్లో LNG ప్లాంట్లు, నార్తర్న్ వర్జీనియాలో డేటా సెంటర్లు, న్యూయార్క్ JFK, లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్‌లలో ప్రధాన టెర్మినల్ నిర్మాణాలు, అలాగే డకొటా ఆయిల్ పైప్‌లైన్ వంటి ప్రధాన ఎనర్జీ ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడి పెట్టినట్టు రిపోర్ట్ చెబుతోంది. అమెరికా తీసుకున్న ఈ 200 బిలియన్ డాలర్లలో గణనీయమైన మొత్తం కేమన్ ఐలాండ్స్, డెలావేర్ వంటి చోట్ల ఉన్న షెల్ కంపెనీల ద్వారా రావడం వల్ల, ఈ రుణాలు ఎక్కువగా దాచిపెట్టబడ్డాయి. ఇది మాత్రమే కాదు.. చైనా సంస్థలు బయోటెక్,రోబోటిక్స్,సెమీకండక్టర్స్ వంటి కీలక టెక్నాలజీ రంగాల్లో అమెరికన్ కంపెనీల్లో వాటాలు పొందడం భద్రతా నిపుణుల్లో ఆందోళన పెంచుతోంది.
వివరాలు
చైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద అధికారిక రుణదాత
AidData తుది రిపోర్ట్ ప్రకారం, చైనా ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద అధికారిక రుణదాతగానే ఉంది. గత అంచనాల కంటే ఎంతో పెద్ద రుణ పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తూ, తన ఆర్థిక ప్రభావాన్ని ముఖ్యంగా అమెరికా వంటి ప్రధాన ప్రత్యర్థి దేశాల్లో కూడా విస్తరించగలిగిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.