Disney-Reliance merger: ఫిబ్రవరి నాటికి డిస్నీ-రిలయన్స్ విలీనం పూర్తి!
టెలికాం రంగంలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ఇప్పుడు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వాల్ట్ డిస్నీ విలీన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గత వారం లండన్‌లో రెండు కంపెనీల మధ్య కీలక ఒప్పంద సంతకాలు జరిగాయి. ఈ మేరకు నాన్ బైండింగ్ ఒప్పందం కుదిరింది. డిస్నీకి చెందిన కెవిన్ మేయర్, ముఖేష్ అంబానీ ప్రతినిధి మనోజ్ మోదీ మధ్య లండన్‌లో అనేక దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందం ఖరారైంది.
రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటా
ఇరు కంపెనీల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేసిన నేపథ్యంలో విలీన ప్రక్రియ వేగంగా జరగనుంది. ఫిబ్రవరి 2024 నాటికి విలీన ప్రక్రియ పూర్తవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు కంపెనీలు విలీనమైన తర్వాత.. రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటా ఉంటుంది. ఈ డీల్ పూర్తయిన తర్వాత దేశంలోనే అతిపెద్ద మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా రియలన్స్ అవతరించనుంది. భారతదేశంలో డిస్నీకి చెందిన స్టార్ ఇండియాకు 77 ఛానెల్‌లు.. రిలయన్స్‌కు చెందిన వయాకామ్-18 పరిధిలో 38 ఛానెల్‌లు ఉన్నాయి. విలీనం తర్వాత 115 ఛానెల్‌లు ఒకే ప్లాట్‌ఫారమ్ కిందుకు రానున్నాయి. డిస్నీ-రిలయన్స్ విలీనమైన తర్వాత.. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల రిలయల్స్ గట్టి పోటీ ఇవ్వనుంది.