Thermos : వినియోగదారులకు అలర్ట్.. థర్మోస్ ఉత్పత్తులు వాడేవారికి హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ బ్రాండ్ థర్మోస్‌కు చెందిన లక్షల సంఖ్యలో ఉత్పత్తులపై భారీ రీకాల్ ప్రకటించారు. స్టాపర్‌లో లోపం కారణంగా అది ఒక్కసారిగా బయటకు ఎగిరిపడి వినియోగదారులకు గాయాలు కలిగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కంపెనీ సుమారు 8.2 మిలియన్ ఫుడ్ జార్లు, బాటిళ్లను వెనక్కి పిలిచింది. ఈ ఘటనల్లో కొందరికి శాశ్వతంగా చూపు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నట్లు వెల్లడైంది. అమెరికా కన్స్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్ విడుదల చేసిన నోటీసు ప్రకారం, ఈ రీకాల్‌లో దాదాపు 5.8 మిలియన్ స్టెయిన్‌లెస్ కింగ్ ఫుడ్ జార్లు, అలాగే సుమారు 2.3 మిలియన్ స్పోర్ట్స్‌మన్ ఫుడ్, బెవరేజ్ బాటిళ్లు ఉన్నాయి.
వివరాలు
చూపు కోల్పోయిన వినియోగదారులు..
ఈ ఉత్పత్తులు 2008 మార్చి నుంచి 2024 జూలై వరకు టార్గెట్, వాల్మార్ట్, అమెజాన్ వంటి ప్రధాన రిటైల్ స్టోర్లలో విస్తృతంగా అమ్ముడయ్యాయి. కంటైనర్‌ను ఓపెన్ చేసిన సమయంలో స్టాపర్ ఒక్కసారిగా బయటకు దూసుకువచ్చి వినియోగదారులను తాకిన 27 ఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో కొందరికి గాయాలు అయ్యి చికిత్స అవసరమైంది. అలాగే ముగ్గురు వినియోగదారులు శాశ్వతంగా చూపు కోల్పోయినట్లు సమాచారం. ఈ సమస్యకు ప్రధాన కారణం స్టాపర్ డిజైన్‌లో ఉన్న లోపమేనని గుర్తించారు. స్టాపర్ మధ్యలో ప్రెజర్ రిలీఫ్ మెకానిజం లేకపోవడంతో, కంటైనర్ లోపల ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా విడుదల అవుతోంది. దీంతో స్టాపర్ బలంగా బయటకు ఎగిరిపడుతోంది.
వివరాలు
థర్మోస్ కీలక ప్రకటన..
ఈ రీకాల్‌లో భాగంగా స్టెయిన్‌లెస్ కింగ్ ఫుడ్ జార్లు (మోడల్స్ SK3000, SK3020 — జూలై 2023కి ముందు తయారు చేసినవి) అన్ని స్పోర్ట్స్‌మన్ ఫుడ్ అండ్ బెవరేజ్ బాటిళ్లు (మోడల్ SK3010) ఉన్నాయి. ప్రభావిత ఉత్పత్తులు వివిధ రంగుల్లో లభ్యమవుతాయి. వీటి పక్కభాగంలో థర్మోస్ బ్రాండ్ పేరు ఉండగా, కింద భాగంలో మోడల్ నంబర్లు ఉంటాయి. వినియోగదారులు వెంటనే ఈ ఉత్పత్తుల వినియోగాన్ని ఆపాలని అధికారులు సూచిస్తున్నారు. మోడల్ ఆధారంగా ఉచితంగా కొత్త ప్రెజర్ రిలీఫ్ స్టాపర్ లేదా పూర్తిగా కొత్త ఉత్పత్తిని కంపెనీ అందిస్తామని థర్మోస్ వెల్లడించింది.