ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన వ్వవస్థాపకులు, సీఈఓలు వీరే
ఓపెన్‌ఏఐ(OpenAI) సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్‌ను కంపెనీ సీఈఓ పదవి నుంచి తొలగించారు. ఆల్ట్‌మాన్ స్థాపించిన కంపెనీలో ఆయనే ఉద్యోగాన్ని కోల్పోయారనే వార్త టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. సీఈఓలు, కంపెనీ వ్యవస్థాపకులను తొలగించడం టెక్ ప్రపంచంలో ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా ఆపిల్, ట్విట్టర్, ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు తమ సీఈఓలు, వ్యవస్థాపకులను తొలగించాయి. వాళ్లెవరో ఇప్పుడు తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ 1976లో ఆపిన్‌ను స్థాపించారు. అనతికాలంలోనే సంస్థను విలువైన కంపెనీగా మార్చారు. ఐపాడ్, ఐఫోన్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. కొన్ని కారణాల వల్ల 1985లో ఆపిల్ నుంచి కంపెనీ బోర్డును స్టీవ్‌ను తొలగించింది. 90వ దశకంలో తిరిగి ఆపిల్ సీఈఓ మళ్లీ బాధ్యతలు స్వీకరించారు.
సచిన్ బన్సల్(ఫ్లిప్‌కార్ట్)
అక్టోబరు 2007లో ఫ్లిప్‌కార్ట్‌ను దిల్లీ ఐఐటీ పూర్వ విద్యార్థులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ స్థాపించారు. 2018లో వాల్‌మార్ట్‌తో ఒప్పందం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బోర్డుతో సచిన్ బన్సల్ వివాదం ఏర్పడింది. అతను కంపెనీలో తన మొత్తం వాటాను ఒక బిలియన్ డాలర్లకు విక్రయించి, కంపెనీ నుంచి నిష్క్రమించాడు. అష్నీర్ గ్రోవర్(BharatPe) భారత్ పే BharatPe) సహ వ్యవస్థాపకుల్లో అష్నీర్ గ్రోవర్ ఒకరు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో గ్రోవర్‌ను బోర్డు నుంచి తొలగించారు. జెర్రీ యాంగ్(యాహూ) యాహూ సెర్చ్ ఇంజన్, వెబ్ సర్వీస్ వ్యవస్థాపకుల్లో జెర్రీ యాంగ్ ఒకరు. 2008లో యాహూను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని ఈయన వ్యతిరేకించారు. దీంతో వాటాదారులతో విబేధాల కారణంగా ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేశారు.
జాక్ డోర్సే (ట్విట్టర్)
జాక్ డోర్సీ కూడా తన సొంత కంపెనీ నుంచి తొలగించబడిన వారిలో ఒకరు. 2006లో జాక్ డోర్సే ట్విట్టర్‌ని స్థాపించారు. ఆ సమయంలో డోర్సే కంపెనీకి సీఈఓ అయ్యారు. కానీ అతని పనితీరు బాగా లేదని 2008లో ఆయన్ను తొలగించారు. డోర్సే 2015లో కంపెనీకి తిరిగి సీఈఓ అయ్యారు. 2021లో సీఈఓ పదవికి ఆయనే స్వయంగా రాజీనామా చేశారు. పరాగ్ అగర్వాల్(ట్విట్టర్) డోర్సే తర్వాత ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ వచ్చారు. ఈయన కూడా సీఈఓ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. కంపెనీని మస్క్ కొనుగోలు చేసిన తర్వాత, కంపెనీలోని అగ్ర నాయకత్వాన్ని తొలగించారు. ఈ క్రమంలో పరాగ్ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుంచి తప్పించారు.