LOADING...
Credit Score: తక్కువ వడ్డీకే రుణాలు పొందాలంటే ఈ ఒక్క స్కోరు చాలా కీలకం
తక్కువ వడ్డీకే రుణాలు పొందాలంటే ఈ ఒక్క స్కోరు చాలా కీలకం

Credit Score: తక్కువ వడ్డీకే రుణాలు పొందాలంటే ఈ ఒక్క స్కోరు చాలా కీలకం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

సొంత ఇల్లు, కారు కొనుగోలు చేయడం ప్రతి మధ్యతరగతి కుటుంబం కల. అయితే ఆ కలలను నిజం చేసుకోవడంలో బ్యాంకు రుణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కానీ రుణం తీసుకునే సమయంలో వడ్డీ రేట్ల రూపంలో చెల్లించాల్సిన అదనపు భారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వడ్డీ భారాన్ని తగ్గించడంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది క్రెడిట్ స్కోరు. ఆర్థిక లావాదేవీల్లో మీరు ఎంత క్రమశిక్షణగా వ్యవహరిస్తున్నారో ఈ స్కోరు తెలియజేస్తుంది. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోరు 800 దాటితే, బ్యాంకుల దృష్టిలో మీరు నమ్మకమైన రుణగ్రహీతగా గుర్తింపు పొందుతారు. అందువల్ల తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

వివరాలు

7.25 శాతం వడ్డీకే రుణం లభించే అవకాశం

ప్రస్తుతం గృహరుణాలపై ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 7.25 శాతం నుంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే ఈ తక్కువ వడ్డీ అందరికీ వర్తించదు. మీ క్రెడిట్ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారుతాయి. క్రెడిట్ స్కోరు 800 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే 7.25 శాతం వడ్డీకే రుణం లభించే అవకాశం ఉంటుంది. స్కోరు 750 నుంచి 799 మధ్య ఉంటే వడ్డీ 7.35 శాతం నుంచి 7.50శాతం వరకు పెరుగుతుంది. స్కోరు 700 నుంచి 749 మధ్య ఉంటే 7.60 శాతం నుంచి 7.80శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అదే స్కోరు 650 కంటే తక్కువగా ఉంటే 8.40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ విధించే అవకాశముంది.

వివరాలు

నెలకు రూ.43,075 చెల్లించాల్సి వస్తుంది 

ఉదాహరణకు 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల గృహరుణం తీసుకున్నట్లు భావిస్తే, 800 పైన స్కోరు ఉన్నవారికి 7.25 శాతం వడ్డీతో నెలవారీ ఈఎంఐ సుమారు రూ.39,519 ఉంటుంది. అదే తక్కువ స్కోరు కారణంగా 8.40 శాతం వడ్డీ పడితే నెలకు రూ.43,075 చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రతి నెలా సుమారు రూ.3,550 అదనపు భారం పడుతుంది. ఈ మొత్తం 20 ఏళ్లలో కలిపి దాదాపు రూ.8.5 లక్షలకు చేరుతుంది. కారు రుణాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా కార్ లోన్లపై 8.70 శాతం నుంచి 9.85 శాతం వరకు వడ్డీ ఉంటుంది. మీ స్కోరు 750 దాటితే 8.70-8.75 శాతం తక్కువ వడ్డీకే రుణం పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు

కొనుగోలు ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం

అదే స్కోరు 700 కంటే తక్కువగా ఉంటే 9.65-9.85 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. దీంతో కారు కొనుగోలు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. అందుకే క్రెడిట్ స్కోరును ఎప్పుడూ 800 పైన ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని ఆర్థిక నియమాలను తప్పనిసరిగా పాటించాలి. రుణ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువు తేదీకి ముందే చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యం జరిగినా స్కోరు తగ్గే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆటో-డెబిట్ సదుపాయం ఉపయోగించడం మంచిది. మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి ఖర్చు చేయకూడదు. ఉదాహరణకు మీ లిమిట్ రూ.1 లక్ష అయితే, నెలకు రూ.30 వేల లోపే వినియోగించడం ఉత్తమం. దీనినే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు.

Advertisement

వివరాలు

30 నుంచి 50 శాతం వరకు భారీ చక్రవడ్డీ పడుతుంది.

చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని భావిస్తారు. కానీ ఇలా చేయడం వల్ల మిగిలిన మొత్తంపై 30నుంచి 50శాతం వరకు భారీ చక్రవడ్డీ పడుతుంది. ఇది అప్పుల భారాన్ని పెంచడమే కాకుండా క్రెడిట్ స్కోరును తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరం లేకపోయినా ప్రతి బ్యాంకులో లేదా ఆన్‌లైన్ యాప్‌లలో తరచూ రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయకూడదు. ప్రతి దరఖాస్తు సమయంలో బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలిస్తాయి.ఇలాంటి విచారణలు ఎక్కువైతే స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత క్రెడిట్ కార్డులను అవసరం లేదని రద్దు చేయడం మంచిది కాదు. మీ క్రెడిట్ చరిత్ర ఎంత పాతదైతే, స్కోరు అంత బలంగా ఉంటుంది.

వివరాలు

మొత్తం బాకీని పూర్తిగా చెల్లించాలి

అప్పులు పూర్తిగా తీర్చలేక బ్యాంకుతో చర్చించి కొంత మొత్తం చెల్లించి ఖాతాను మూసివేయడాన్ని 'సెటిల్‌మెంట్' అంటారు. ఇది క్రెడిట్ రిపోర్ట్‌లో నమోదు అవుతుంది. భవిష్యత్తులో ఇల్లు లేదా కారు రుణాలు పొందడంలో ఇది పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ మొత్తం బాకీని పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. మీ పేరు లేదా పాన్ నంబర్‌పై ఎవరైనా మోసపూరితంగా రుణాలు తీసుకున్నారేమో తరచూ తనిఖీ చేసుకోవాలి. ప్రస్తుతం BHIMయాప్‌లో ట్రాన్స్‌యూనియన్ సిబిల్ భాగస్వామ్యంతో ఉచితంగా క్రెడిట్ స్కోరు చెక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. క్రెడిట్ స్కోరు ఒక్కరోజులో పెరగదు. దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణతోనే దాన్ని 800పైన ఉంచుకోవచ్చు. మంచి స్కోరును కొనసాగిస్తే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం లభిస్తుంది.

Advertisement