Loading...
Andhra Pradesh: తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ.. రూ.1,614 కోట్ల ఆటోమొబైల్ పెట్టుబడులు
తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ.. రూ.1,614 కోట్ల ఆటోమొబైల్ పెట్టుబడులు

Andhra Pradesh: తమిళనాడును వెనక్కి నెట్టి ఏపీ.. రూ.1,614 కోట్ల ఆటోమొబైల్ పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 02, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడుల అవకాశం దక్కింది. దక్షిణ కొరియాకు చెందిన మూడు ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థలు రాష్ట్రంలో రూ.1,614 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలైన హ్యుందాయ్, కియాకు విడిభాగాలు సరఫరా చేసే ఈ కంపెనీలు అనంతపురం జిల్లాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటి రాకతో రాయలసీమలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించడంతో పాటు 1,418 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ పెట్టుబడులకు సంబంధించి మూడు దక్షిణ కొరియా కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో హ్వాషిన్ సంస్థ రూ.850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 100 మందికి ఉపాధి లభించనుంది.

వివరాలు 

మొదట తమిళనాడుతో చర్చలు.. చివరికి ఏపీకి పెట్టుబడులు

సియోన్ కంపెనీ రూ.514 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా అత్యధికంగా 918 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

ఇక ఇవామెట్ సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేసి 400 మందికి ఉపాధి కల్పించనుంది.

వాస్తవానికి ఈ మూడు కంపెనీలు తొలుత తమిళనాడులో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావించాయి.

ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమలో బలమైన స్థానం కలిగిన ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిపాయి.

అయితే, ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేయడం, మెరుగైన పారిశ్రామిక రాయితీలు అందించే అవకాశాలు ఉండటంతో కంపెనీలు ఏపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

వివరాలు 

గత జులైలో దక్షిణ కొరియాకి నారా లోకేష్

గత జులైలో ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించారు.

ఈ సందర్భంగా హ్యుందాయ్, కియా సరఫరా వ్యవస్థకు చెందిన పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అనంతరం ఏపీ ప్రభుత్వానికి చెందిన ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు ద్వారా కంపెనీలతో సంప్రదింపులు కొనసాగించారు.

ఈ ప్రయత్నాలు ఫలించి పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు పలు నివేదికలు విశ్లేషించాయి.

ADVERTISEMENT

వివరాలు 

ఆటోమొబైల్ హబ్‌గా అనంతపురం

దక్షిణ భారతదేశంలో ఆటోమొబైల్ తయారీ రంగానికి తమిళనాడు ఇప్పటికీ ప్రధాన కేంద్రంగా ఉంది.

అనేక వాహన తయారీ సంస్థలు, విడిభాగాల సరఫరాదారులు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రంగంలో గట్టి పోటీ ఇస్తోంది.

అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా కార్ల తయారీ పరిశ్రమ విజయవంతంగా కొనసాగుతోంది.

తాజాగా మూడు దక్షిణ కొరియా విడిభాగాల తయారీ సంస్థలు కూడా అక్కడే ప్లాంట్లు ఏర్పాటు చేయనుండటంతో జిల్లాలో ఆటోమొబైల్ పరిశ్రమ మరింత విస్తరించే అవకాశం ఉంది.

ఈ పెట్టుబడులతో అనంతపురం దక్షిణ భారతదేశంలోనే కీలకమైన ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT