TikTok: 250 మంది ఉద్యోగులకు టిక్‌టాక్ షాక్.. నాష్‌విల్లే కార్యాలయం మూసివేత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సోషల్ మీడియా వేదిక టిక్‌టాక్ (TikTok) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు అమెరికాలోని నాష్‌విల్లే కార్యాలయాన్ని పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టిక్‌టాక్ వెల్లడించింది. తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు భవిష్యత్ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగ బృందాలను పునర్వ్యవస్థీకరించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. నాష్‌విల్లేలోని టిక్‌టాక్ కార్యాలయంలో సంస్థకు చెందిన కంటెంట్ మోడరేషన్ విభాగంలోని కొంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కార్యాలయాన్ని అక్టోబర్ 5న అధికారికంగా మూసివేయనున్నారు.
వివరాలు
కంటెంట్ మోడరేషన్‌లో ఏఐ వైపు అడుగులు..
నాష్‌విల్లే కార్యాలయం మూసివేత, ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలు సోషల్ మీడియా సంస్థల్లో చోటుచేసుకుంటున్న కీలక మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి.
టిక్‌టాక్‌తో పాటు పలు సోషల్ మీడియా కంపెనీలు కంటెంట్ మోడరేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై మరింతగా ఆధారపడుతున్నాయి.
హింసాత్మకమైన లేదా అసభ్యకరమైన కంటెంట్‌ను గుర్తించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు.
గతంలో ఇలాంటి కంటెంట్‌ను గుర్తించడం, పరిశీలించడం, తొలగించడం వంటి బాధ్యతలను ప్రధానంగా మానవ కంటెంట్ మోడరేటర్లు నిర్వహించేవారు.
అయితే, కంటెంట్ మోడరేషన్‌లో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో మానవ సిబ్బందిపై ఆధారపడే సంప్రదాయ విధానంలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంటోంది.
వివరాలు
యూజర్ల భద్రతకు కట్టుబడి ఉన్నాం: టిక్‌టాక్
ఉద్యోగుల తొలగింపు, కార్యాలయం మూసివేత వంటి తాజా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. యూజర్లకు సురక్షితమైన, సానుకూలమైన అనుభవాన్ని అందించడంలో తమ నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదని టిక్‌టాక్ స్పష్టం చేసింది.
టిక్‌టాక్ యూఎస్‌డీఎస్ జాయింట్ వెంచర్ ప్రతినిధి జన్నా క్రౌలీ మాట్లాడుతూ.. అమెరికాలో టిక్‌టాక్‌ను వినియోగిస్తున్న 20 కోట్ల మంది ప్రజలకు భద్రతతో కూడిన, సురక్షితమైన, సానుకూలమైన అనుభవాన్ని అందించేందుకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.
టిక్‌టాక్‌లో తమకు నచ్చిన కంటెంట్‌ను సృష్టించడం, కొత్త విషయాలను తెలుసుకోవడం, ఇతరులతో అనుసంధానం కావడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికన్లకు మెరుగైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.