
Generic Medicines: భారత్‌కు ఊరట.. ఇప్పట్లో అమెరికా జనరిక్ ఔషధాలపై టారిఫ్‌లు లేనట్లే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్, పేటెంట్ కలిగిన ఔషధాలపై 100% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయం సమయంలో జనరిక్ ఔషధాల (Generic Medicines) దిగుమతులపై ఆయన ఎటువంటి టారిఫ్ విధింపు నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది. తాజాగా ఈ విషయంపై వైట్ హౌస్ నుండి కూడా స్పందన వచ్చి, జనరిక్ ఔషధాలపై టారిఫ్ విధించే ప్రణాళిక ఏదీ లేదని వెల్లడించింది. ఈ సమాచారాన్ని శ్వేతసౌధ వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. దీంతో ప్రస్తుతానికి భారత్‌కు ఊరట లభించినట్లయ్యింది.
వివరాలు
టారిఫ్‌లు అక్టోబర్ 1 నుండి అమల్లోకి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన ప్రకారం, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికాకు దిగుమతి అయ్యే బ్రాండెడ్, పేటెంట్ ఔషధాలపై 100%సుంకాలు విధించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ టారిఫ్‌లు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి.అయితే, ఈ పరిణామంలో జనరిక్ ఔషధాలపై కూడా సుంకాలు విధించాలా అనే అంశం ట్రంప్ పాలసీ కౌన్సిల్‌లో చర్చ జరిగింది. చర్చలో భాగంగా కౌన్సిల్ సభ్యులు, జనరిక్ మందులపై సుంకాలు విధించడం వల్ల దేశీయంగా వాటి ధరలు పెరుగుతాయని, అలాగే ఔషధ సరఫరాలో లోపాలు వచ్చే ప్రమాదం ఉందని వాదించారు. అదేవిధంగా,ఎక్కువ సుంకాలు విధించినా అమెరికాకు తగిన లాభం పొందడం కష్టం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో ట్రంప్ ఈ అంశంపై వెనక్కి తగ్గారని సమాచారం అందింది.
వివరాలు
సుంకాల విధింపు పై ట్రంప్ కార్యవర్గం ప్రస్తుతానికి సుముఖంగా లేదు
ఈ క్రమంలోనే , సెక్షన్ 232 కింద జనరిక్ మందులపై సుంకాల విధింపు పై ట్రంప్ కార్యవర్గం ప్రస్తుతానికి సుముఖంగా లేదని శ్వేత సౌధం ప్రతినిధి కుష్ దేశాయ్ పేర్కొన్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఈ పరిణామాలు భారత్ కు పెద్ద ఊరట కలిగించేలా ఉన్నాయి.ఎందుకంటే అమెరికాకు మన దేశం నుంచి అత్యధికంగా జనరిక్ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుండి సుమారు 30 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.64 లక్షల కోట్ల) విలువైన ఔషధాలు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇందులో దాదాపు మూడవ భాగం అమెరికా మార్కెట్‌కి చేరింది. ఈ గణాంకాలు మన ఔషధ పరిశ్రమకు అమెరికా ఎంత ముఖ్యమో స్పష్టంగా చూపుతున్నాయి.
వివరాలు
అమెరికాకు చేరే జనరిక్ ఔషధాల్లో 47% వాటా భారత్‌దే
అమెరికాకు చేరే జనరిక్ ఔషధాల్లో 47% వాటా భారత్‌దే. అందువల్ల, ఈ జనరిక్ ఔషధాలపై టారిఫ్ విధింపు అంశాన్ని అమెరికా పక్కన పెట్టడం, మన ఔషధ కంపెనీలకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇది మన దేశ ఔషధ పరిశ్రమకు మరింత అవకాసాలు మరియు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే అవకాశాన్ని ఇచ్చింది.