Loading...
USA: హర్మూజ్‌లో ట్రంప్‌ 20% టోల్‌ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?
హర్మూజ్‌లో ట్రంప్‌ 20% టోల్‌ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?

USA: హర్మూజ్‌లో ట్రంప్‌ 20% టోల్‌ ప్రతిపాదన.. ఒక్కో చమురు ట్యాంకర్‌పై రూ.287 కోట్లు?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ అమల్లోకి వస్తే ప్రపంచ చమురు మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రకారం.. పూర్తిగా చమురుతో లోడ్‌ చేసిన ఒక వెరీ లార్జ్‌ క్రూడ్‌ క్యారియర్‌ (VLCC) నుంచి అమెరికా సుమారు 30 మిలియన్‌ డాలర్లు,అంటే దాదాపు రూ.287 కోట్లు టోల్‌గా వసూలు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు.

వివరాలు 

ట్యాంకర్‌కు 30 నుంచి 32 మిలియన్‌ డాలర్ల వరకు టోల్

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడి చమురు ధరను సుమారు 80 డాలర్లుగా పరిగణిస్తే.. ఒక VLCCలో దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది.

ఈ లెక్కన నౌకలోని చమురు మొత్తం విలువ సుమారు 160 మిలియన్‌ డాలర్లకు చేరుతుంది.

దీనిపై 20 శాతం టోల్‌ విధిస్తే ఒక్కో ట్యాంకర్‌కు 30 నుంచి 32 మిలియన్‌ డాలర్ల వరకు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే ట్రంప్‌ ప్రతిపాదించిన ఈ 20 శాతం టోల్‌పై అమెరికా తన మిత్రదేశాలతో చర్చలు జరిపిందా లేదా అనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు.

అలాగే ఈ ప్రతిపాదనపై శ్వేతసౌధం నుంచి కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.

వివరాలు 

2 మిలియన్‌ డాలర్ల టోల్‌ వసూలు చేస్తున్న ఇరాన్

ఇదిలా ఉండగా ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్‌ సుమారు 2 మిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రూ.19 కోట్ల వరకు మాత్రమే రుసుము వసూలు చేస్తోంది.

అయితే ఇది కూడా శాశ్వత విధానం కాకుండా తాత్కాలిక ప్రాతిపదికన అమలులో ఉందని సమాచారం.

ట్రంప్‌ ప్రతిపాదనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ స్పందిస్తూ.. వాణిజ్య నౌకలకు పూర్తి భద్రత కల్పించి సురక్షితంగా జలసంధిని దాటించే సామర్థ్యం తమకు ఉందని చెప్పారు.

ఆ సేవలకు తగిన రుసుము వసూలు చేస్తామని, అయితే అమెరికా ప్రతిపాదించిన 20 శాతం టోల్‌ మాత్రం అత్యంత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు.

తాము సముచితమైన ఛార్జీలనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT