Loading...
TV Narendran: టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఆయనేనా? ఎవరీ టీవీ నరేంద్రన్‌..?
టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఆయనేనా? ఎవరీ టీవీ నరేంద్రన్‌..?

TV Narendran: టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ ఆయనేనా? ఎవరీ టీవీ నరేంద్రన్‌..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించడంతో టాటా గ్రూప్‌లో తదుపరి నాయకత్వంపై ఆసక్తి పెరిగింది. చంద్రశేఖరన్‌ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఇప్పుడు కార్పొరేట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ రేసులో టాటా స్టీల్‌ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే.. ఆయన ఎవరు? ఛైర్మన్‌ బాధ్యతలు దక్కితే ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది?

వివరాలు 

ముందు నుంచీ టాటా గ్రూప్‌తోనే..

61 ఏళ్ల టీవీ నరేంద్రన్‌ ప్రస్తుతం టాటా స్టీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా కొనసాగుతున్నారు.

టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌గా ఆయన పేరును సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.

అయినప్పటికీ నరేంద్రన్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కార్పొరేట్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తిరుచ్చిలోని ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసిన నరేంద్రన్‌.. అనంతరం ఐఐఎం కలకత్తాలో మేనేజ్‌మెంట్‌ విద్య అభ్యసించారు.

1988లో టాటా గ్రూప్‌లో అడుగుపెట్టిన ఆయన.. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇదే సంస్థలో కొనసాగుతున్నారు.

వివరాలు 

ముందు నుంచీ టాటా గ్రూప్‌తోనే..

తొలినాళ్లలో సేల్స్‌, మార్కెటింగ్‌, అంతర్జాతీయ వ్యాపార విభాగాల్లో పనిచేశారు.

ముఖ్యంగా ఆగ్నేయాసియా మార్కెట్లలో టాటా స్టీల్‌ కార్యకలాపాలను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు.

2013లో టాటా స్టీల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఆ తర్వాత సంస్థ సీఈఓగా పదోన్నతి పొందారు.

ఇదిలా ఉండగా.. టాటా సన్స్‌ తదుపరి ఛైర్మన్‌ పదవి కోసం నరేంద్రన్‌తో పాటు నోయెల్‌ టాటా, సౌరభ్‌ అగర్వాల్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం చంద్రశేఖరన్‌ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. అప్పటిలోగా టాటా సన్స్‌ కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ఛైర్మన్‌కు మూడు కీలక సవాళ్లు

టాటా సన్స్‌ కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేసినా.. ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు మాత్రం అంత తేలికైనవి కావు.

ముఖ్యంగా ఎయిరిండియా, టాటా డిజిటల్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి కీలక విభాగాల్లోని నష్టాలను తగ్గించి, వాటిని వృద్ధి బాట పట్టించడం కొత్త అధిపతికి పెద్ద సవాల్‌గా మారనుంది.

ప్రస్తుతం ఎయిరిండియా నష్టాల్లో కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంస్థ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.22,238 కోట్లకు చేరాయి.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం, పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు వంటి పరిణామాలు ఎయిరిండియా వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి.

ఈ పరిస్థితులను అధిగమించి విమానయాన వ్యాపారాన్ని స్థిరమైన వృద్ధి దిశగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ఛైర్మన్‌కు మూడు కీలక సవాళ్లు

మరోవైపు టాటా డిజిటల్‌ ఆదాయం గతేడాది పెరిగినప్పటికీ.. సంస్థకు రూ.4,974 కోట్ల నష్టం వచ్చింది.

ముఖ్యంగా బిగ్‌బాస్కెట్‌ 10 నిమిషాల డెలివరీ విభాగంలోకి ఆలస్యంగా ప్రవేశించడం ప్రతికూల ప్రభావం చూపింది.

అప్పటికే ఇతర ఈ-కామర్స్‌ సంస్థలు ఈ రంగంలో బలమైన పోటీని ఏర్పరచుకున్నాయి.

అలాగే టాటా డిజిటల్‌కు చెందిన టాటా న్యూ యాప్‌ కూడా మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో వినియోగదారుల ఆదరణను పొందలేకపోయింది.

వివరాలు 

కొత్త ఛైర్మన్‌కు మూడు కీలక సవాళ్లు

దీంతో ఈ విభాగాన్ని మరింత పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లడం కూడా కొత్త ఛైర్మన్‌కు కీలక బాధ్యతగా మారనుంది.

ఇక టాటా ఎలక్ట్రానిక్స్‌ విభాగంలోనూ నష్టాలను తగ్గించి, కంపెనీ పెట్టుకున్న వృద్ధి లక్ష్యాలను సాధించేలా వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది.

మొత్తంగా.. టాటా గ్రూప్‌లో తదుపరి నాయకుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా, నష్టాల్లో ఉన్న వ్యాపారాలను గాడిలో పెట్టడం, కొత్త రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడం, టాటా సన్స్‌ భవిష్యత్‌ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం వంటి కీలక బాధ్యతలు ఆయన ముందుండనున్నాయి.

ADVERTISEMENT