ట్విట్టర్ ధర బాగా పడిపోయిందిగా: ఎలాన్ మస్క్ పెట్టినదాంట్లో 33%వ్యాల్యూ మాత్రమే
ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొన్న తర్వాత దానిలో అనేక మార్పులు తీసుకొచ్చాడు. అప్పటికప్పుడే లోగో మార్చడం, ఆ తర్వాత తిరిగి పాత ట్విట్టర్ లోగోను మళ్ళీ తీసుకురావడం, బ్లూ టిక్ కావాలంటే సబ్ స్క్రిప్షన్ పెట్టడం సహా అన్నీ చేసాడు. ట్విట్టర్ నష్టాల్లో ఉందని దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించాడు. ఈ చర్యలన్నింటి కారణంగా ఎలాన్ మస్క్, ట్విట్టర్...జనాల నోళ్ళలో బాగా నానాయి. అయితే ఇంత చేసినా కూడా ట్విట్టర్ లాభాల్లోకి రాలేకపోయిందంటే నమ్ముతారా? అవును, ట్విట్టర్ వ్యాల్యూ బాగా పడిపోయిందని ఫిడిలిటీ అనే సంస్థ వెల్లడి చేసింది. ఎలాన్ మస్క్ కొన్న ధరలో 33శాతానికి ట్విట్టర్ ధర పడిపోయిందని ఫిడిలిటీ తెలియజేసింది.
ట్విట్టర్ ప్రస్తుత వ్యాల్యూ 15బిలియన్ డాలర్లు
నిజానికి ట్విట్టర్ ను తాను ఎక్కువ డబ్బులకు కొనుగోలు చేసానని ఎలాన్ మస్క్ భావించాడు. తాను చెల్లించిన (44బిలియన్ డాలర్లు) దానిలో సగం కూడా ట్విట్టర్ వ్యాల్యూ ఉండదని ఎలాన్ మస్క్ అన్నాడు. తాజాగా ఫిడిలిటీ సంస్థ, ట్విట్టర్ వ్యాల్యూ బాగా పడిపోయిందని చెబుతోంది. దీని ప్రకారం, ప్రస్తుతం ట్విట్టర్ వ్యాల్యూ 15బిలియన్ డాలర్లుగా ఉంది. ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ తీసుకున్న తర్వాత దాని వ్యాల్యూ పడిపోవడం ఇది మూడవసారి కావడం గమనించాల్సిన విషయం. ట్విట్టర్ కు వచ్చే యాడ్ బిజినెస్ తగ్గిందని ఫిడిలిటీ వెల్లడి చేసింది. అంతేకాకుండా ట్విట్టర్ కు కొత్తగా సైన్ అప్ అయిన వారి సంఖ్య తగ్గిందని సమాచారం.