LOADING...
Uber Lays Off: ఉబెర్‌లో భారీ ఉద్యోగాల కోత.. హెచ్‌ఆర్‌ విభాగంలో 23 శాతం మంది ఔట్‌!
ఉబెర్‌లో భారీ ఉద్యోగాల కోత.. హెచ్‌ఆర్‌ విభాగంలో 23 శాతం మంది ఔట్‌!

Uber Lays Off: ఉబెర్‌లో భారీ ఉద్యోగాల కోత.. హెచ్‌ఆర్‌ విభాగంలో 23 శాతం మంది ఔట్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
12:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రముఖ రైడ్‌-హైలింగ్‌ సంస్థ ఉబెర్‌ (Uber)తన 'పీపుల్ అండ్ ప్లేసెస్' (People and Places) విభాగంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ క్రమంలో ఆ విభాగంలోని సుమారు 23శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ విభాగం మానవ వనరులు(HR),ఉద్యోగుల నియామకాలు,కార్యాలయ నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది. తొలగించిన ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్యను ఉబెర్‌ వెల్లడించకపోయినా,ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 1శాతం వరకు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల సంస్థలో జరిగిన నాయకత్వ మార్పుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉబెర్‌ అధ్యక్షురాలు జిల్‌ హాజెల్‌బేకర్‌ (Jill Hazelbaker)ఈ విభాగం బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యకలాపాలను మరింత సరళీకరించడం,సంస్థ పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.

వివరాలు 

Uberకు AI వినియోగానికి సంబంధించిన ఖర్చుల పెరుగుదల 

కాలక్రమేణా కొన్ని బృందాల్లో బాధ్యతల పునరావృతం, స్పష్టతలేమి పెరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, వ్యాపార యూనిట్లతో ఉద్యోగుల బృందాలు మరింత దగ్గరగా పనిచేసేలా చేయాలని సంస్థ భావిస్తోంది. నివేదికల వ్యవస్థను సులభతరం చేయడం, విభాగంలో ఉన్న సంక్లిష్టతను తగ్గించడం కూడా ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది. మరోవైపు, ఉబెర్‌ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు(AI)సాధనాల వినియోగానికి సంబంధించిన ఖర్చుల పెరుగుదలతో కూడా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఉద్యోగులు పెద్దఎత్తున ఏఐ టూల్స్‌ను వినియోగించడం వల్ల 2026 సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్‌ను కేవలం నాలుగు నెలల్లోనే ఖర్చు చేసినట్లు ఇటీవల నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

కంపెనీ ఉద్యోగులకు AI సాధనాల వినియోగంపై పరిమితులు విధించింది

ముఖ్యంగా మానవ జోక్యం తక్కువగా ఉండే 'ఏజెంటిక్‌ ఏఐ' (Agentic AI) టూల్స్‌ వినియోగం పెరగడంతో వ్యయం భారీగా పెరిగినట్లు సమాచారం. దీంతో ఖర్చులను నియంత్రించేందుకు ఉబెర్‌ ఉద్యోగుల ఏఐ టూల్స్‌ వినియోగంపై పరిమితులు విధించింది. కొత్త విధానం ప్రకారం సాధారణ వినియోగదారుల కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు నెలకు 1,500 డాలర్ల వరకు మాత్రమే ఏఐ టూల్స్‌ వినియోగానికి అనుమతి ఉంటుంది. అయితే వ్యాపార అవసరాలను బట్టి అధిక పరిమితులకు ఆమోదం పొందే అవకాశం కూడా కల్పించింది. ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ, అదే సమయంలో వ్యయాలను అదుపులో ఉంచేందుకు టెక్‌ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఉబెర్‌ తాజా చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Advertisement