Digital Life Certificate Campaign 5.0: పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0 ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
పెన్షనర్లకు కేంద్రం ముఖ్యమైన సూచన చేసింది. దేశవ్యాప్తంగా ఐదో విడత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) ప్రచారం 5.0ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖలతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ, అణుశక్తి, అంతరిక్ష శాఖల్లో సహాయ మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగనుంది. దేశవ్యాప్తంగా వేలాది ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెన్షనర్లు ప్రతి ఏడాది సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్ ప్రక్రియను మరింత సులభంగా, వేగంగా, డిజిటల్ విధానంలో పూర్తి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
వివరాలు
జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సదుపాయం
ఈ సందర్భంగా మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. డిజిటల్ సేవలను వినియోగించుకోవడం ద్వారా వృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
ముఖ్యంగా జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
దీనివల్ల పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదని వివరించారు.
వివరాలు
ఎవరు ఎప్పటి నుంచి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి?
పెన్షనర్లు తమ వయసును బట్టి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే తేదీలు మారుతాయి.
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు అక్టోబర్ 1 నుంచి సమర్పించవచ్చు.
80 ఏళ్లలోపు ఉన్న పెన్షనర్లు నవంబర్ 1 నుంచి లైఫ్ సర్టిఫికెట్ అందించవచ్చు.
అయితే ఈ రెండు వర్గాల వారికి చివరి గడువు నవంబర్ 30, 2026.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లతో పాటు ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల ద్వారా నగదు పొందుతున్న అర్హులైన వారందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
SPARSH విధానం ద్వారా పెన్షన్ పొందుతున్న రక్షణ రంగ పెన్షనర్లు కూడా గడువులోగా తమ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి.
వివరాలు
జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎలా సమర్పించాలి?
ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణతో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ (DLC) పొందవచ్చు.
ఇందుకోసం ఫేస్ అథెంటికేషన్ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించవచ్చు.
లేదంటే అధీకృత జీవన్ ప్రమాణ్ కేంద్రానికి వెళ్లి వేలిముద్ర లేదా కంటి ఐరిస్ ద్వారా ధ్రువీకరణ చేయించుకోవచ్చు.
ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ పొందాలంటే ముందుగా అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌లో జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ RD యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలి.
వివరాలు
జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎలా సమర్పించాలి?
అనంతరం జీవన్ ప్రమాణ్ యాప్‌ను తెరిచి పెన్షనర్ ఆధార్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని అందించాలి.
స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరిస్తూ ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. ధ్రువీకరణ విజయవంతమైతే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది.
అనంతరం మొబైల్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ప్రామాణ్ ఐడీ (Pramaan ID)ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
ఈ సర్టిఫికెట్ డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. పెన్షన్ చెల్లించే సంబంధిత అధికారులు జీవన్ ప్రమాణ్ డేటాబేస్ ద్వారా దీన్ని నేరుగా పొందవచ్చు.