UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు
2022లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు భారతదేశంలో రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి. డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, మొబైల్, ప్రీపెయిడ్ కార్డ్‌ల వంటి చెల్లింపు మోడ్‌లో యూపీఐ ద్వారా రూ. 149.5 ట్రిలియన్ల విలువైన 87.92 బిలియన్ లావాదేవీలను జరిగినట్లు పేమెంట్ సేవల్లో గ్లోబల్ లీడర్ అయిన వరల్డ్‌లైన్ నివేదిక సోమవారం చెప్పింది. పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం), పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) లావాదేవీలు చేయడానికి వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పేర్కొంది. ఇందులో పీ2ఎం 40శాతం, పీ2పీ 44శాతం మార్కెట్ వాటాతో ఉన్నట్లు వరల్డ్‌లైన్ చెప్పింది. పీ2ఎం, పీ2పీ ఈ రెండు మోడ్‌లో 74.05 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగినట్లు, వాటి విలువ రూ.126 ట్రిలియన్లుగా వరల్డ్‌లైన్ తన నివేదకలో పేర్కొంది.
2021తో పోలిస్తే 2022లో యూపీఐ లావాదేవీలు 91శాతం పెరిగాయ్
అయితే విలువ పరంగా యూపీఐ పీ2ఎం 18 శాతం వాటాను కలిగి ఉందని, యూపీఐ పీ2పీ డిజిటల్ లావాదేవీలలో 66శాతం వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపు పరిమాణంలో 7శాతం ఉండగా, విలువ 14శాతంగా ఉన్నట్లు వరల్డ్‌లైన్ వివరించింది. యూపీఐ లావాదేవీలు 2021తో పోలిస్తే 2022లో వాల్యూమ్‌లో 91శాతం పెరిగాయి. విలువ పరంగా చూస్తే 76 శాతం పెరుగుదల నమోదైంది. 2022 చివరి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్‌ల సంఖ్య 1.02బిలియన్లు అని నివేదిక చూపించింది. 2022లో క్రెడిట్ కార్డులు 2.76 బిలియన్లు కాగా, విలువ రూ. 13.12 ట్రిలియన్లు. డెబిట్ కార్డ్ లావాదేవీలు 3.64బిలియన్లు కాగా, విలువ రూ.7.4ట్రిలియన్లు.