UPI charges explained: యూపీఐ వినియోగదారులకు కీలక అప్డేట్.. కొత్త బిల్లులో ఏముంది?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ చెల్లింపులపై అవసరమైతే భవిష్యత్తులో ఛార్జీలు విధించేలా కేంద్ర ప్రభుత్వానికి చట్టపరమైన అధికారం కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, ఈ నిర్ణయంతో వెంటనే యూపీఐ లావాదేవీలపై ఫీజులు అమల్లోకి వస్తాయని భావించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్-2026 ద్వారా పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007లో కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయకుండా ఉన్న చట్టపరమైన అడ్డంకిని ఈ సవరణ తొలగించింది.
వివరాలు
వెంటనే ఛార్జీలు ఉండవు
దీంతో అవసరమైతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి కొన్ని డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు అనుమతించే అవకాశం కల్పించింది.
ఈ బిల్లులో యూపీఐ లావాదేవీలపై వెంటనే ఎలాంటి ఫీజు విధించే ప్రతిపాదన లేదు.
ప్రస్తుతం మాదిరిగానే వినియోగదారులు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు చెల్లించకుండా యూపీఐ ద్వారా చెల్లింపులు కొనసాగించవచ్చు.
భవిష్యత్తులో ఛార్జీలు విధించాలంటే ఏ చెల్లింపు విధానాలకు వర్తిస్తాయి,ఎంత మేరకు ఉంటాయి,ఏ తరహా లావాదేవీలకు అమలు చేస్తారనే అంశాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
చట్టంలో మార్పు ఏమిటి?
ఇప్పటివరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269SU కింద పేర్కొన్న ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించకుండా పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10A నిరోధించింది.
తాజా సవరణతో ఆ పరిమితి తొలగిపోయింది. దీంతో అవసరమని భావిస్తే కేంద్ర ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలను అనుమతించే అవకాశం కలిగింది.
వివరాలు
ఛార్జీలు వస్తే ఎవరు చెల్లించాలి?
యూపీఐపై చర్చల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR). డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారులు బ్యాంకులు లేదా పేమెంట్ కంపెనీలకు చెల్లించే రుసుమునే MDR అంటారు.
ప్రస్తుతం యూపీఐ చెల్లింపులపై MDR లేకపోవడంతో చిన్న వ్యాపారులు, వినియోగదారులు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులను స్వీకరించారు.
భవిష్యత్తులో MDR అమల్లోకి వస్తే అది సాధారణంగా వ్యాపారుల లావాదేవీలకే వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం ప్రకటించలేదు.
వివరాలు
బ్యాంకులు,ఫిన్‌టెక్ సంస్థలు ఎందుకు కోరుతున్నాయి?
ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో యూపీఐ ఒకటిగా ఎదిగింది.
ప్రతి నెలా కోట్లాది లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థ నిర్వహణకు భారీగా పెట్టుబడులు అవసరమవుతున్నాయని బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు చెబుతున్నాయి.
సాంకేతికత అప్‌గ్రేడ్‌లు, సైబర్ భద్రత, మోసాల నివారణ, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై నిరంతరం ఖర్చు చేయాల్సి వస్తోందని, అందుకే దీర్ఘకాలిక ఆదాయ నమూనా అవసరమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కూడా డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల నిర్వహణకు నిరంతర పెట్టుబడులు అవసరమని, వాటి వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు.
వివరాలు
రోజువారీ యూపీఐ చెల్లింపులు ఖరీదవుతాయా?
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య జరిగే సాధారణ యూపీఐ చెల్లింపులు లేదా చిన్న మొత్తాల లావాదేవీలపై ఛార్జీలు విధించే సూచనలు లేవు.
భవిష్యత్తులో ఏ తరహా లావాదేవీలకు ఫీజులు వర్తించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంటుంది.
యూపీఐ విజయానికి ప్రధాన కారణం ఉచిత సేవలు, సులభమైన వినియోగం.
అందువల్ల ఛార్జీల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా చిన్న వ్యాపారులు, వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.
మొత్తానికి ఈ బిల్లు వెంటనే యూపీఐపై ఛార్జీలు విధించడానికి కాదు. భవిష్యత్తులో అవసరమైతే డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు స్థిరమైన ఆదాయ నమూనా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చట్టపరమైన వెసులుబాటు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.