UPI MDR Charges: యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. జనవరి 1కి వాయిదా? పూర్తి వివరాలు ఇవిగో..
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ లావాదేవీలపై కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)అమలు గడువు దగ్గరపడుతున్న వేళ.. ఈ విధానం వాయిదా పడే అవకాశాలున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొత్త ఎండీఆర్ నిబంధనలు సాధారణంగా అక్టోబర్ 15నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే వీటిని 2027 జనవరి 1కి వాయిదా వేయొచ్చన్న చర్చ మొదలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి తుది అధికారిక ప్రకటన రాలేదు. కొత్త ఎండీఆర్ విధానం అమల్లోకి వచ్చినా వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ చెల్లింపులు(పీ2పీ) ఉచితంగానే కొనసాగుతాయి. అదే విధంగా వ్యాపారులకు చేసే రూ.2,000వరకు యూపీఐ చెల్లింపులపైనా ఎలాంటి ఎండీఆర్ ఉండదు. చిన్న వ్యాపారులు క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.1లక్ష వరకు స్వీకరించే చెల్లింపులకూ జీరో ఎండీఆర్ వర్తిస్తుంది.
వివరాలు
ఎండీఆర్ ఛార్జీలు ఎలా ఉంటాయంటే..
ఈ కారణంగా మొత్తం పీర్-టు-మర్చంట్ లావాదేవీల్లో దాదాపు 96 శాతం ఎలాంటి ప్రభావానికి లోనుకావని కేంద్రం వెల్లడించింది.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని వ్యాపారి లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్ వర్తించేలా ప్రతిపాదించారు.
రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీల్లో ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 మాత్రమే ఎండీఆర్‌గా పరిమితి ఉంటుంది.
రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయం వంటి ముఖ్యమైన రంగాల్లో రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులకు ఒక్కో లావాదేవీపై రూ.5 ఫ్లాట్ ఎండీఆర్‌ను ప్రతిపాదించారు.
ఇక మూలధన మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్ వర్తించనుంది. దీనికి ఒక్కో లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.
వివరాలు
వినియోగదారులపై అదనపు భారం ఉండదు
ఎండీఆర్ అనేది వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ మొత్తం ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐకి వెళ్లదు. యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో భాగమైన బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తారు.
ఎండీఆర్ కారణంగా వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా బ్యాంకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది.