UPI Payments: యూపీఐ పేమెంట్లపై కొత్త ఛార్జీలు?.. భారీ వ్యాపారులకు ఎండీఆర్ విధింపుపై కేంద్రం కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు చేసే వారికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా అందుతున్న యూపీఐ సేవల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ఈ మార్పులు సాధారణ వినియోగదారులపై కాకుండా, పెద్ద వ్యాపార సంస్థలు, అధిక టర్నోవర్ కలిగిన మర్చంట్లకు మాత్రమే వర్తించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ద్వారా ఎంత మొత్తంలో లావాదేవీ చేసినా వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. గత ఐదేళ్లుగా యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)ను కేంద్ర ప్రభుత్వం సున్నాగా కొనసాగిస్తోంది. దీంతో డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించాయి.
వివరాలు
కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూపులు
యూపీఐ మర్చంట్ ఛార్జీలకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
దీనికి ఆమోదం లభించిన వెంటనే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం,భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI)మధ్య ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.
త్వరలో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది.
ప్రతిపాదన ప్రకారం, ఈ ఛార్జీలు కేవలం పెద్ద వ్యాపార సంస్థలు,ఈ-కామర్స్ కంపెనీలకే వర్తిస్తాయి.
దీంతో యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంకులు,పేమెంట్ యాప్‌లకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
జనవరి 2020 నుంచి యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ విధానం అమల్లో ఉండగా,ఇప్పుడు భారీ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ ఫీజు తిరిగి ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
వివరాలు
ఎంత మేర ఛార్జీలు ఉండొచ్చు?
ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం, వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైగా ఉన్న మర్చంట్లపై 5 నుంచి 7 బేసిస్ పాయింట్ల వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉంది.
అలాగే రూ.10 వేలకుపైగా జరిగే ప్రతి యూపీఐ లావాదేవీపై సుమారు రూ.5 నుంచి రూ.7 వరకు మర్చంట్ ఫీజు ఉండొచ్చని చర్చ జరుగుతోంది.
వివరాలు
చిన్న వ్యాపారులు, వినియోగదారులకు ఎలాంటి భారం లేదు
వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువగా ఉన్న చిన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రతిపాదనలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే సాధారణ వినియోగదారులు ఇప్పటిలాగే ఉచితంగానే యూపీఐ ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం కొనసాగించవచ్చు.
అంటే ఈ మార్పులు సాధారణ ప్రజలపై ప్రభావం చూపే అవకాశం లేదని సమాచారం.
వివరాలు
యూపీఐ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం
యూపీఐ సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, మౌలిక వసతులను విస్తరించేందుకు స్థిరమైన ఆదాయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం జీరో ఎండీఆర్ విధానం కారణంగా పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవల సంస్థలకు అదనపు ఆదాయం రావడం లేదు.
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ కూడా నిర్వహణ ఖర్చులకు పూర్తిగా సరిపోవడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో యూపీఐ సేవల నిర్వహణకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించాలని పేమెంట్ యాప్‌లు చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో పెద్ద వ్యాపారులపై మాత్రమే మర్చంట్ ఛార్జీలు విధించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.