Page Loader
UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 
యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ

UPI transactions: యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా!.. సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్‌పీసీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మనమెప్పుడైనా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు, ఆ లావాదేవీ పూర్తవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత "సక్సెస్‌" అనే సందేశం వచ్చే వరకూ మనం ఆ స్క్రీన్‌ను వ్యాపారి లేదా దుకాణదారుడికి చూపించి మాత్రమే అక్కడినుంచి వెళ్తాము. కొన్ని సందర్భాల్లో ఆ సందేశం వచ్చేంతవరకూ ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఇకపై ఆ సమయం సగానికి తగ్గబోతోంది. ఈ కొత్త మార్పులు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. యూపీఐ వ్యవస్థకు సంబంధించి వివిధ లావాదేవీల గడువును సవరించినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఒక సర్క్యులర్ ద్వారా ప్రకటించింది.

వివరాలు 

వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ మార్పులు

ఒక లావాదేవీ పూర్తయ్యేంతవరకూ గడిచే సమయాన్ని 'రెస్పాన్స్ టైమ్' అని పిలుస్తారు. మనం ఏదైనా చెల్లింపు చేస్తే, దాని ఫలిత సందేశం (సక్సెస్, ఫెయిల్, రివర్స్‌డ్ మొదలైనవి) వచ్చేంతవరకూ అది సమయంగా పరిగణించబడుతుంది. ఎన్‌పీసీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, ఇప్పటివరకు 30 సెకన్లు పట్టిన క్రెడిట్ లేదా డెబిట్ లావాదేవీలు ఇకపై కేవలం 15 సెకన్లలో పూర్తయ్యేలా మార్పులు చేశారు. ఇంతకే పరిమితం కాకుండా, ట్రాన్సాక్షన్ స్టేటస్, రివర్సల్‌, అడ్రస్ వాలిడేషన్ వంటి ప్రక్రియల సమయం కూడా 30 సెకన్ల నుండి 10 సెకన్లకు కుదించబడ్డది. వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు ఈ మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఎన్‌పీసీఐ పేర్కొంది.

వివరాలు 

 15 సెకన్లలో.. 

ఈ మార్పులు పాటించేందుకు పేటీఎం, ఫోన్‌పే లాంటి యూపీఐ సేవలందించే సంస్థలు,బ్యాంకులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది. ఉదాహరణకి.. ఎస్‌బీఐ ఖాతాదారుడు, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న వ్యాపారికి, యోనో యాప్ ద్వారా చెల్లింపు చేసినట్టనుకుందాం. ఆ లావాదేవీ విజయవంతంగా పూర్తయ్యిందా లేదా అనేది ఐసీఐసీఐ బ్యాంక్ ధృవీకరించాలి. ఆ సమాచారం ఎన్‌పీసీఐ నెట్‌వర్క్ ద్వారా ఎస్‌బీఐ వినియోగదారుడికి చూపించాలి. ఇప్పటివరకు దీనికి 30 సెకన్లు పట్టేది. జూన్ 16 నుంచి అదే ప్రక్రియ 15 సెకన్లలో పూర్తవుతుంది. ఇది కేవలం చెల్లింపుల లావాదేవీలకే పరిమితం కాదు. ఇతర యూపీఐ లావాదేవీల వేళ కూడా గణనీయంగా తగ్గనుందని, డిజిటల్ పేమెంట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.