LOADING...
US: అమెరికాలో క్యాన్సర్‌ మందుల కొరత.. భారత్‌ సాయం కోరిన యూఎస్‌ఎఫ్‌డీఏ!
అమెరికాలో క్యాన్సర్‌ మందుల కొరత.. భారత్‌ సాయం కోరిన యూఎస్‌ఎఫ్‌డీఏ!

US: అమెరికాలో క్యాన్సర్‌ మందుల కొరత.. భారత్‌ సాయం కోరిన యూఎస్‌ఎఫ్‌డీఏ!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కీలక ఔషధాల కొరత తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) భారత్‌ సహకారాన్ని కోరింది. ఊపిరితిత్తులు, వృషణాలు, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో వినియోగించే ఐఫోస్ఫామైడ్ ఇంజెక్షన్లను అత్యవసరంగా సరఫరా చేయాలని భారత ఔషధ తయారీదారుల సంఘం (ఐడీఎంఏ)ను అమెరికా సంప్రదించింది. ఈ పరిణామంతో భారతీయ ఔషధ కంపెనీలకు కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉందనే అంచనాల మధ్య మంగళవారం స్టాక్ మార్కెట్లో ఫార్మా కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి.

వివరాలు 

ఎందుకు ఏర్పడింది కొరత?

అమెరికాకు ఐఫోస్ఫామైడ్ ఔషధాన్ని సరఫరా చేస్తున్న బాక్స్టర్ ఇంటర్నేషనల్‌కు చెందిన కాంట్రాక్ట్ తయారీ కేంద్రంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపాయి. ఈ కారణాల వల్ల ఐఫోస్ఫామైడ్ కొరత 2026 సంవత్సరం చివరి వరకు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల కంపెనీలకూ అవకాశం అంతర్జాతీయ ఫార్మా కేంద్రంగా పేరొందిన హైదరాబాద్‌కు చెందిన సంస్థలతో పాటు దేశంలోని పలు ప్రముఖ ఔషధ కంపెనీలు ఈ పరిస్థితి వల్ల లాభపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

షేర్లలో కొనుగోళ్ల జోరు

సిప్లా,జైడస్,ఆల్కెమ్,అలివస్,లారస్ ల్యాబ్స్,ఇప్కా ల్యాబ్స్ వంటి కంపెనీలతో పాటు ఇంజెక్షన్ల కాంట్రాక్ట్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన గ్లాండ్ ఫార్మా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశముంది. అమెరికా నుంచి వచ్చిన ఈ డిమాండ్ ప్రభావంతో మంగళవారం ఫార్మా రంగ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినా నిఫ్టీ ఫార్మా సూచీ మాత్రం 2 శాతం లాభపడింది.

Advertisement

వివరాలు 

భారత ఎగుమతులకు మరింత ఊతం

లారస్ ల్యాబ్స్ షేరు 3.18 శాతం,అరబిందో ఫార్మా 2.88 శాతం,సిప్లా 1.36 శాతం,గ్లాండ్ ఫార్మా 4.54 శాతం, టోరెంట్ ఫార్మా 1.50 శాతం,జైడస్ 2.44 శాతం,పిరమాల్ ఫార్మా 6.65 శాతం,డాక్టర్ రెడ్డీస్ 0.79 శాతం, లుపిన్ 0.96 శాతం,సన్ ఫార్మా 0.22 శాతం,ఇప్కా ల్యాబ్స్1.42 శాతం,నాట్కో ఫార్మా 0.71 శాతం,ఆల్కెమ్ 0.61 శాతం,జేబీకెమికల్స్ 0.95 శాతం,బయోకాన్0.56 శాతం చొప్పున లాభాలను నమోదు చేశాయి. గత ఆర్థికసంవత్సరంలో భారత్ నుంచి ప్రపంచ దేశాలకు రూ.11,430కోట్ల విలువైన క్యాన్సర్ ఔషధాలు ఎగుమతి అయ్యాయి. ఇందులో అమెరికాకే రూ.4,356కోట్ల విలువైన మందులు సరఫరా చేయడం విశేషం.తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో భారతీయ ఫార్మా కంపెనీల స్థానం మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

నిబంధనల్లో సడలింపులు

సాధారణంగా అమెరికా మార్కెట్లోకి ఏ ఔషధాన్నైనా అనుమతించాలంటే, అది తయారయ్యే ప్లాంటు యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద తప్పనిసరిగా నమోదు అయి ఉండాలి. అయితే ప్రస్తుతం నెలకొన్న తీవ్ర కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యూఎస్‌ఎఫ్‌డీఏ ఈ నిబంధనల్లో తాత్కాలిక సడలింపులు కల్పించింది. యూఎస్‌ఎఫ్‌డీఏలో నమోదు కాకపోయినా,అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ గతంలో నియంత్రణ నిబంధనలను సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఉన్న భారతీయ తయారీ కేంద్రాల నుంచి కూడా ఐఫోస్ఫామైడ్ ఔషధాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా 1 గ్రాము,3 గ్రాముల పరిమాణాల్లో ఈ ఇంజెక్షన్‌ను సరఫరా చేయగల సంస్థల వివరాలను వెంటనే అందించాలని ఐడీఎంఏను యూఎస్‌ఎఫ్‌డీఏ కోరింది.

Advertisement