Dugarajapatnam Port: దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్.. 15 నెలల్లో డీపీఆర్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
దుగరాజపట్నంలో ప్రతిపాదిత పోర్టు, షిప్‌బిల్డింగ్, షిప్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోర్టు,షిప్‌యార్డు లేఅవుట్‌లతో పాటు మొత్తం షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయనుంది. అలాగే ప్రాజెక్టు అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై అంచనాలను రూపొందించనుంది. ఈ ప్రక్రియను 15 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోర్టు,షిప్‌బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధి కోసం ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ),విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ) భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు అమలుకు 'నేషనల్ షిప్‌బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఎన్‌షిప్ ఏపీ లిమిటెడ్)'పేరుతో ఇప్పటికే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి.
వివరాలు
మాస్టర్‌ప్లాన్‌పై భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు
షిప్‌యార్డు, అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అన్ని భాగస్వామ్య సంస్థలతో చర్చలు జరిపిన తర్వాతే మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపం ఇవ్వనున్నారు. రోడ్డు రవాణా ఆపరేటర్లు, రైల్వే శాఖ, షిప్పింగ్ లైన్లు, క్లియరింగ్ అండ్ ఫార్వార్డింగ్ ఏజెంట్లు, తనిఖీ, ధ్రువీకరణ సంస్థలు, కస్టమ్స్, ఎక్సైజ్ అధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రాజెక్టు వ్యయంపై కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా బ్రేక్‌వాటర్స్ వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి అయ్యే ఖర్చులు, పోర్టు అభివృద్ధి వ్యయం, షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమయ్యే పెట్టుబడులను విడివిడిగా అంచనా వేయనున్నారు.
వివరాలు
కీలక నిర్మాణాలపై స్పష్టతకు డీపీఆర్
డీపీఆర్ తయారీ కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రకటన జారీ చేసింది. ఎంపికైన సంస్థ గతంలో నిర్వహించిన అధ్యయనాలు, రూపొందించిన నివేదికలు, ప్రణాళికలను పరిశీలించడంతో పాటు అవసరమైన సమాచార సేకరణ చేపట్టనుంది. కార్గో రవాణా అంచనాలు, నౌకల పరిమాణాలు, భూసర్వేలు, ప్రాథమిక ఇంజినీరింగ్ అధ్యయనాలను విశ్లేషించి సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించనుంది. ఈ ప్రణాళికలో నిర్మాణాలు చేపట్టే ప్రాంతాల గుర్తింపు, పోర్టు,బెర్త్‌ల లేఅవుట్, వర్క్‌షాప్‌లు, డ్రైడాక్స్‌తో కూడిన షిప్‌యార్డు నమూనా, డ్రెడ్జింగ్ మరియు రెక్లమేషన్ పనులు, నావిగేషన్ సేవలు, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, మెరైన్ పరికరాలు, గోదాములు, రవాణా అనుసంధాన సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది నమూనాను సిద్ధం చేయనున్నారు.