Loading...
CM Chandrababu: బీసీల సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ముసాయిదా సిద్ధం: చంద్రబాబు
బీసీల సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ముసాయిదా సిద్ధం: చంద్రబాబు

CM Chandrababu: బీసీల సంరక్షణకు ప్రత్యేక చట్టం.. ముసాయిదా సిద్ధం: చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటులోనూ వారు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీసీల రుణం తీర్చుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం, సంరక్షణ కోసం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడటం లేదని స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు 'నేతన్నల సేవలో' పథకాన్ని ప్రారంభించారు.

వివరాలు

చెప్పినవే కాదు.. చెప్పనివీ అమలు చేస్తున్నాం

రాష్ట్రంలోని అర్హులైన 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను విడుదల చేశారు.

అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. చేనేత రంగం, బీసీల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.

చేనేత దేశం గర్వించదగిన కళ అని చంద్రబాబు అన్నారు. ఆ కళకు ఆంధ్రప్రదేశ్‌ నిలయంగా ఉందని పేర్కొన్నారు.

ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లను విదేశాలకు ఎగుమతి చేసేవారని, అందుకే చీరాలను 'మినీ ముంబయి'గా పిలిచేవారని గుర్తు చేశారు.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కార్మికులు టీడీపీకి అండగా నిలిచారని చెప్పారు.

చేనేతలకు రాయితీపై విద్యుత్తు అందిస్తామని, 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని తెలిపారు.

వివరాలు

చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25వేలు

చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల చొప్పున అందిస్తున్నామని, ఈ రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

అందులో భాగంగానే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్నల సేవలో' పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.

ఎన్నికల్లో చెప్పిన హామీలనే కాకుండా చెప్పని అంశాలను కూడా అమలు చేస్తున్నామనడానికి ఈ పథకమే నిదర్శనమన్నారు.

ఉచిత విద్యుత్తు ద్వారా 62,541 చేనేత కుటుంబాలకు, 10,032 పవర్‌లూమ్‌ యూనిట్లకు ప్రయోజనం కలుగుతోందని చంద్రబాబు వివరించారు.

85 వేల మంది కార్మికులకు నెలకు రూ.4 వేల చొప్పున రూ.35 కోట్లను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 109 చేనేత సొసైటీలకు క్యాష్‌ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించామని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచాం

బీసీల సంక్షేమంలో భాగంగా మత్స్యకార కుటుంబాలకు రెండేళ్లలో **రూ.505 కోట్లు** అందించామని చంద్రబాబు తెలిపారు.

వడ్డెరలకు మైనింగ్‌ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్‌ షాపులు కేటాయించామని చెప్పారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు బీసీలకు మూడు కిలోవాట్ల వరకు లభించే ప్రయోజనానికి అదనంగా రూ.20 వేల రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని విమర్శించారు. ఇతర రాష్ట్రాలు ఏపీ పరిస్థితిని చూసి ఎగతాళి చేసే పరిస్థితి వచ్చిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టామని చెప్పారు.

గడిచిన రెండేళ్లలో పేదల సంక్షేమానికి రూ.1.50 లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

కుటుంబానికి ఇల్లు.. రాష్ట్రానికి రాజధాని

ఇసుక అక్రమాలను అరికట్టడంలో అధికారులు విఫలమైతే తానే రీచ్‌లలోకి వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు.

బీచ్‌ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చీరాల సమీపంలో విమానాశ్రయం ఏర్పాటు చేసే అంశంపైనా దృష్టి సారిస్తామని చెప్పారు.

గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసి, ఇతర రాష్ట్రాల్లో ఏపీ చులకనయ్యే పరిస్థితి తీసుకొచ్చిందని చంద్రబాబు విమర్శించారు.

మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏపీ ఇమేజ్‌ను తిరిగి పునరుద్ధరించిందన్నారు.

ఈ నెల 13న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజధానిలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు మళ్లీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

వివరాలు

మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు

కుటుంబానికి ఇల్లు ఎంత అవసరమో.. రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరమని వ్యాఖ్యానించారు.

పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని, గత ప్రభుత్వానికి 'బ్యాడ్‌ ఇమేజ్‌' ఉంటే తమ ప్రభుత్వానికి 'బ్రాండ్‌ ఇమేజ్‌' వచ్చిందని అన్నారు.

తమ ప్రభుత్వం చేపట్టిన పనులను కొందరు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు పేపర్‌ లీక్‌ అంటూ కొత్త కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కోర్టు చీవాట్లు పెట్టినా ధర్నాల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

వివరాలు

'వాళ్లు జెన్‌-జీ కాదు.. గొడ్డలి జనరేషన్‌'

జెన్‌-జీ యువత అభివృద్ధిని కోరుకుంటోందని, అయితే కొందరు 'గొడ్డలి జనరేషన్‌'కు చెందిన వ్యక్తులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇలాంటి అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.

ఒక ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా ఆధారాలను తారుమారు చేసి, వ్యక్తులను మార్చి కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేంటని మాట్లాడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

ఇలాంటి వారిని ఏమనాలని ప్రశ్నించారు. పరామర్శ పేరుతో గంటల తరబడి రోడ్లను దిగ్బంధించి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వివరాలు

అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి

పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లి వారి బేళ్లను నాశనం చేసి రైతులకు కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు. రోడ్డుపైకి వచ్చి 'రప్పారప్పా' అంటూ రౌడీయిజం చేయడం, బహిరంగంగా మద్యం తాగి రచ్చ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

కొంతమంది కుమ్ములాటలో ఒక వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో మృతి చెందారని పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలను ప్రజలు గమనించి, అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వివరాలు

నేతన్నల సేవలో పలువురు ప్రముఖులు

'నేతన్నల సేవలో' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్, చేనేత కార్మికులు సుమలత, వెంకట్రావు, చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, చేనేత జౌళిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, ఆయన కుమారుడు మహేంద్రనాథ్‌ జీడిపప్పు మాలతో ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు.

ADVERTISEMENT