Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.1.2 కోట్ల ప్రమాద బీమా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన సమగ్ర ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 14 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఉద్యోగులు లేదా ప్రభుత్వంపై ఎలాంటి ప్రీమియం భారం లేకుండా,ఉద్యోగుల జీత ఖాతాలు నిర్వహిస్తున్న బ్యాంకుల భాగస్వామ్యంతోనే ఈ బీమా సదుపాయం అందించనుండటం ప్రత్యేకతగా నిలిచింది. ఈ తరహా విధానం దేశంలోనే తొలిసారిగా అమలవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
వివరాలు
10 లక్షల మందికి ప్రయోజనం
ఈ బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు కలిపి సుమారు 10 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు పొందుతున్న ప్రతి ఉద్యోగి ఈ పథకం పరిధిలోకి రానున్నారు. ఉద్యోగి జీతం జమ అయ్యే బ్యాంకు నిబంధనల ఆధారంగా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ.60 లక్షల నుంచి గరిష్టంగా రూ.1.2 కోట్ల వరకు బీమా పరిహారం అందించనున్నారు. విమాన ప్రమాదంలో మరణించిన సందర్భాల్లో ఈ పరిహారం రూ.2 కోట్ల వరకు లభించేలా ఏర్పాటు చేశారు.
వివరాలు
పైలట్ ప్రాజెక్ట్‌గా సింగరేణి కాలరీస్ కార్మికులు
ఇప్పటికే సింగరేణి కాలరీస్ కార్మికుల కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ బీమా విధానాన్ని అమలు చేశారు. ఆ సందర్భంగా ప్రమాదాల్లో మరణించిన దాదాపు 45మంది కార్మికుల కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించారు. అక్కడ ఈ పథకం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత అమలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల ప్రమాదబీమా పథకానికి ఆమోదం లభించింది. అనంతరం అవసరమైన పరిపాలనాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసి ఇప్పుడు అమల్లోకి తీసుకువస్తున్నారు. ప్రమాద బీమాతో పాటు ఉద్యోగులకు మరో అదనపు ప్రయోజనం కూడా కల్పిస్తున్నారు. 60ఏళ్లలోపు ఉద్యోగి సహజ మరణం చెందినట్లయితే కుటుంబ సభ్యులకు రూ.10లక్షల టర్మ్ లైఫ్ కవర్ అందించనున్నారు.
వివరాలు
ఉద్యోగ సంఘాల హర్షం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్‌జీవో)తో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. రవీంద్రభారతిలో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులతో హాజరై విజయవంతం చేయాలని సంఘాల నాయకులు కోరారు. అదేవిధంగా జులై తొలి వారంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం భారీ బహిరంగ సభ నిర్వహించి క్యాష్‌లెస్ డిజిటల్ హెల్త్ కార్డులు (ఈహెచ్‌ఎస్) పంపిణీ చేయడంతో పాటు కొత్త పీఆర్‌సీ అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం.