LOADING...
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్
రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 మందికి ఉపాధి కల్పించే ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఇంధన రంగం, రక్షణ తయారీ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీకి పెట్టుబడులు మరింత వేగం పుంజుకున్నాయి. సి-డాట్,ఆటోమియామిక్స్ ఇండియా, క్యూపీఐ ఏఐ ఇండియా,ఫ్రూగల్ ఏఐ హబ్‌తో పాటు మొత్తం 11 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో వాటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

వివరాలు 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్

రూ.50 లక్షల నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై త్రైమాసిక పన్ను తగ్గింపుకు కూడా ఆమోదం తెలిపింది. కొత్త రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు,తిరుపతి విమానాశ్రయం మినహా ఇతర విమానాశ్రయాల్లో బార్లు, రిటైల్ దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన విధాన మార్గదర్శకాలకు కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

వివరాలు 

దత్తలూరులో క్షిపణి తయారీ కేంద్రం

నెల్లూరు జిల్లా దత్తలూరు మండలంలో అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు క్షిపణులు, లాయిటరింగ్ మునిషన్ల తయారీ, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు కోసం 300 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించారు. అనంతపురం జిల్లా తిమ్మసముద్రంలో స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సాలిడ్ ప్రొపెల్లెంట్ ప్రాసెసింగ్ కేంద్రం నిర్మాణం కోసం 120.76 ఎకరాల భూమి కేటాయించనున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రక్షణ రంగానికి అవసరమైన పేలుడు పదార్థాల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం ఐకామ్ టెలి లిమిటెడ్‌కు 300 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం లభించింది.

Advertisement

వివరాలు 

టూరిస్ట్ బస్సులకు పన్ను తగ్గింపు

ప్రోటెరియల్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న నియోడైమియం-ఐరన్-బోరాన్ అయస్కాంతాల తయారీ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు కేబినెట్ అంగీకరించింది. రూ.2,250 కోట్ల పెట్టుబడితో అమలుకానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 530 మందికి ఉపాధి లభించనుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్‌తో కాంట్రాక్ట్ క్యారేజీలుగా నడిచే 12 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలపై త్రైమాసిక పన్ను తగ్గించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో సీటుకు త్రైమాసికానికి రూ.4,000గా ఉన్న పన్నును రూ.2,500కు తగ్గించింది. అంటే ఒక్కో సీటుపై రూ.1,500 మేర భారం తగ్గనుంది.

Advertisement

వివరాలు 

10 కొత్త బీసీ గురుకులాలకు ఆమోదం

2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 10 బీసీ గురుకులాలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 54 బీసీ సంక్షేమ వసతి గృహాలను రద్దు చేసి వాటి స్థానంలో గురుకులాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 37 కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ విస్తరణ రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రయోజనాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో ఎస్సీ విద్యార్థులకు 40 శాతం, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం రాష్ట్ర వాటాను పీ4 ద్వారా రాష్ట్ర ఖజానాకు భర్తీ చేయనున్నారు.

వివరాలు 

కాల్వల ఆధునికీకరణకు ఆమోదం

శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల కాంప్లెక్స్ వరకు ఉన్న కాల్వల ఆధునికీకరణ పనులకు గతంలో కుదుర్చుకున్న రెండు అనుబంధ ఒప్పందాలను రాష్ట్ర మంత్రిమండలి అధికారికంగా ఆమోదించింది. మొదట రూ.768.07 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని అనంతరం రూ.1,478.41 కోట్లకు సవరించగా, ఆ సవరణలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

వివరాలు 

పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్‌కు భూమి

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని చిన్నరావుపల్లి, పెదరావుపల్లి గ్రామాల్లో రూ.370 కోట్ల పెట్టుబడితో ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు కోసం పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌కు 70 ఎకరాల భూమి విక్రయ ఒప్పందం అమలు చేయడానికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల మందికి ఉపాధి లభించనుంది. జీడీ నెల్లూరు పారిశ్రామిక వాడలో రూ.12.96 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు 1.57 ఎకరాల భూమిని సీపీ నార్పోక్ కంపెనీకి బదిలీ చేయడానికి పుట్టా లెదర్స్ కంపెనీకి అనుమతి ఇచ్చారు.

వివరాలు 

కాకినాడలో సుస్థిర విమాన ఇంధన కేంద్రం

కాకినాడలో సుస్థిర విమాన ఇంధన ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కోసం ఎస్‌ఏఎఫ్-1 ఇండియా సంస్థకు 45 ఎకరాల భూమి కేటాయించనున్నారు. రూ.1,835 కోట్ల పెట్టుబడితో అమలయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి లభించనుంది. అనకాపల్లిలో 100 మెగావాట్ల డేటా సెంటర్ అనకాపల్లి జిల్లాలో రూ.2,788.3 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు క్లర్ట్ డేటా సెంటర్స్ లిమిటెడ్‌కు 49.93 ఎకరాల భూమి కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 160 ఉద్యోగాలు లభించనున్నాయి. విశాఖ జిల్లాలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం ఇన్‌ఫినిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 5.08 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం లభించింది. రూ.170 కోట్ల పెట్టుబడితో 4,000 ఉద్యోగాలు సృష్టించనున్నారు.

వివరాలు 

తిరుపతి జిల్లాలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు

తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎయిర్ కండీషనర్లు, వాటి విడిభాగాలు, చిన్న గృహోపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్‌కు 36.41 ఎకరాల భూమి కేటాయించనున్నారు. రూ.314.31 కోట్ల పెట్టుబడితో 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. శ్రీసిటీలో రూమ్ ఎయిర్ కండీషనర్ల విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పాటు కోసం అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రూ.445 కోట్ల పెట్టుబడితో 1,250 ఉద్యోగాలు సృష్టించనుంది. అదే ప్రాంతంలో ఆటోమోటివ్ కెమెరా మాడ్యూల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం మెకనెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. రూ.347 కోట్ల పెట్టుబడితో 1,633 ఉద్యోగాలు లభించనున్నాయి.

వివరాలు 

రాజధాని రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు

సీఆర్డీయే అమలు చేస్తున్న ప్లాట్ కోడ్‌ల నామకరణ విధానంలో మార్పుల కారణంగా నమోదైన పత్రాల్లో ప్లాట్ కోడ్‌లు, సరిహద్దుల సవరణ కోసం చేసే రెక్టిఫికేషన్ డీడ్లపై రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి జోన్-2 పరిధిలోని ఉండవల్లి గ్రామంలో భూసమీకరణ పథకం కింద రహదారులు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్, యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ నీటి లైన్, ఎస్టీపీ, అవెన్యూ ప్లాంటేషన్ వంటి మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి రూ.409.78 కోట్ల అంచనా కాంట్రాక్ట్ విలువపై 4.07 శాతం అధికంగా వచ్చిన ఎల్-1 బిడ్‌ను ఆమోదించింది.

వివరాలు 

ఎల్-1 బిడ్‌ను ఆమోదించేందుకు కూడా మంత్రిమండలి నిర్ణయం

మరో మూడు ప్యాకేజీల పనులకు సంబంధించిన ఎల్-1 బిడ్‌లను ఆమోదించి పనులు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులు అందించనున్నాయి. అమరావతి పరిధిలోని పిచుకలపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణానికి పన్నులు, డ్యూటీలు మినహాయించి రూ.125 కోట్ల అంచనా కాంట్రాక్ట్ విలువ కంటే 3.89 శాతం అధికంగా వచ్చిన ఎల్-1 బిడ్‌ను ఆమోదించేందుకు కూడా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.

Advertisement