Loading...
TRAI: మోసపూరిత కాల్స్‌కు ట్రాయ్ చెక్.. విద్యుత్, గ్యాస్, డెలివరీ సేవలకు 1601 నంబర్లు!
విద్యుత్, గ్యాస్, డెలివరీ సేవలకు 1601 నంబర్లు!

TRAI: మోసపూరిత కాల్స్‌కు ట్రాయ్ చెక్.. విద్యుత్, గ్యాస్, డెలివరీ సేవలకు 1601 నంబర్లు!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

టెలికాం రంగంలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సర్వీస్ కాల్స్ కోసం 1600 సిరీస్ నంబర్లను కేటాయించిన ట్రాయ్.. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన రంగాలకు కూడా ప్రత్యేక నంబర్ల విధానాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా విద్యుత్,వంటగ్యాస్,నీటి సరఫరా వంటి యుటిలిటీ సేవలతో పాటు కొరియర్, పార్శిల్ డెలివరీ,లాజిస్టిక్స్ సంస్థల కస్టమర్ సర్వీస్ కాల్స్ కోసం 1601 సిరీస్ నంబర్లను ఉపయోగించడం తప్పనిసరి చేసింది. సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లతో ఫోన్లు చేస్తూ.. కస్టమర్ కేర్ ఏజెంట్లుగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల గణనీయంగా పెరిగాయి.

వివరాలు 

తొలి దశలో ఏ సంస్థలకు వర్తిస్తుంది?

ఈతరహా మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ట్రాయ్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ప్రత్యేక సిరీస్ నంబర్లను అమలు చేయడం ద్వారా అసలైన సర్వీస్ కాల్ ఏదో,మోసపూరిత ఫోన్ ఏదో వినియోగదారులు త్వరగా గుర్తించే అవకాశం ఉంటుంది.

బిజినెస్ లైన్ కథనం ప్రకారం..బ్యాంకింగ్,ఆర్థిక సేవల రంగం(BFSI), ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ముఖ్యమైన కాల్స్ ఇతర సాధారణ వ్యాపార కాల్స్‌తో కలిసిపోకుండా ప్రత్యేక గుర్తింపు కల్పించడమే 1601 సిరీస్ ఉద్దేశం.

తొలిదశలో విద్యుత్ పంపిణీ సంస్థలు, నీటి సరఫరా విభాగాలు,సిటీ గ్యాస్ సంస్థలు,ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లను ఈ నిబంధన పరిధిలోకి తీసుకొచ్చారు.

అదేవిధంగా కొరియర్,పార్శిల్ డెలివరీ,ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థల కస్టమర్ సర్వీస్ కాల్స్‌కు కూడా 1601 సిరీస్ నంబర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

వివరాలు 

90 రోజుల్లో అమలు

కొత్త నిబంధనలను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ ఆదేశించింది.

అర్హత కలిగిన సంస్థలన్నింటినీ 90 రోజుల్లో 1601 సిరీస్ నంబర్ల వ్యవస్థలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది.

ఈ నంబర్లను మధ్యవర్తులకు కాకుండా నిబంధనలకు అర్హత ఉన్న సంస్థలకే నేరుగా కేటాయించనున్నారు.

అయితే 1601 సిరీస్ నంబర్ల వినియోగంపై ట్రాయ్ కొన్ని పరిమితులు కూడా విధించింది.

ఈ నంబర్లను కేవలం సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి మాత్రమే ఉపయోగించాలి.

ఎలాంటి ప్రచార లేదా ప్రమోషనల్ కాల్స్ కోసం వీటిని వినియోగించకూడదని స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

వినియోగదారులకు మరింత భద్రత

1601 సిరీస్ అమలుతో కస్టమర్లకు వచ్చే సర్వీస్ కాల్స్ విషయంలో మరింత స్పష్టత ఏర్పడనుంది.

ముఖ్యంగా కస్టమర్ కేర్ పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్‌ను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుంది.

సాధారణ మొబైల్ నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు కూడా ఈ విధానం ఉపయోగపడనుంది.

ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల టెలికాం వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రత్యేక సిరీస్ నంబర్ల ద్వారా సర్వీస్ కాల్స్‌కు స్పష్టమైన గుర్తింపు రావడంతో స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ను నియంత్రించడంలో ఇది కీలక చర్యగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT