Loading...
PIB Fact Check: కొత్తగా రూ.1,000 నోటు విడుదలవుతుందా? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ
కొత్తగా రూ.1,000 నోటు విడుదలవుతుందా? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ

PIB Fact Check: కొత్తగా రూ.1,000 నోటు విడుదలవుతుందా? వైరల్ వార్తలపై కేంద్రం క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో కొత్తగా రూ.1,000 నోటును విడుదల చేయనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలని వెల్లడించింది. కొత్త రూ.1,000 నోటు విడుదలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో పసుపు రంగులో ఉన్నట్లు కనిపించే రూ.1,000నోటు చిత్రాలు వైరల్ అయ్యాయి. కొత్త నోటును ఇప్పటికే విడుదల చేశారని కొందరు ప్రచారం చేయగా, మరికొందరు నిర్దిష్ట తేదీ నుంచి అది అందుబాటులోకి వస్తుందని పోస్టులు పెట్టారు.

వివరాలు 

2016లో పాత రూ.1,000 నోటు చెల్లుబాటు రద్దు

దీంతో నిజంగానే కొత్త రూ.1,000 నోటు రాబోతోందా? అనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి.

ఈ ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించింది. కొత్త రూ.1,000 నోటు విడుదలైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.

ఇలాంటి వార్తలను నమ్మే ముందు అధికారిక వర్గాలు వెల్లడించిన సమాచారాన్ని పరిశీలించాలని ప్రజలకు సూచించింది.

ధ్రువీకరణ లేని పోస్టులను ఇతరులకు షేర్ చేయవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో ఆర్‌బీఐ మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్‌లో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 నోట్లు చెలామణిలో ఉన్నాయి.

2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే.

వివరాలు 

రూ.1,000 నోటు స్థానంలో కొత్త నోటును తీసుకురాని ఆర్‌బీఐ

అప్పటివరకు చెలామణిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లు ఆ తర్వాత చట్టబద్ధమైన చెల్లింపుల హోదాను కోల్పోయాయి.

వాటిలో రూ.500 నోటును కొత్త డిజైన్‌తో తిరిగి ప్రవేశపెట్టారు. అయితే, పాత రూ.1,000 నోటు స్థానంలో కొత్త నోటును తీసుకురాలేదు.

మరోవైపు, పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ.2,000 నోటును కూడా ఆర్‌బీఐ ఉపసంహరించుకునే ప్రక్రియను 2023 మేలో ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కొత్త రూ.1,000 నోటు విడుదలపై అధికారిక ప్రకటన వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసే పోస్టులను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఇలాంటి వార్తలను షేర్ చేసే ముందు వాటి నిజానిజాలను నిర్ధారించుకోవాలని చెబుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం చేసిన ట్వీట్ 

ADVERTISEMENT