LOADING...
Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు
ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు

Volkswagen: ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ ఉద్యోగ కోతలు? లక్ష మందిపై ప్రభావం పడే అవకాశాలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 26, 2026
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియలో భాగంగా పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించడంతో పాటు నాలుగు తయారీ కేంద్రాలను మూసివేసే ప్రతిపాదనలను కంపెనీ పరిశీలిస్తున్నట్లు జర్మన్ వ్యాపార పత్రిక మేనేజర్ మ్యాగజైన్ వెల్లడించింది. ఈ ప్రణాళిక అమలైతే ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చని కథనం పేర్కొంది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతానికి సమానం. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో 43 శాతం మంది జర్మనీలోనే ఉన్నారు.

వివరాలు

రాబోయే 5 ఏళ్లలో పెట్టుబడులు తగ్గించే యోచన..

కంపెనీ సీఈవో ఒలివర్ బ్లూమ్ రూపొందించిన '2030 గ్రూప్ టార్గెట్ పిక్చర్' వ్యూహంలో భాగంగానే ఈ చర్యలు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ అంశాలపై చర్చించగా, వచ్చే నెలలో జరగనున్న సూపర్‌వైజరీ బోర్డు సమావేశంలోనూ వాటిని పరిశీలించే అవకాశం ఉంది. ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్, అలాగే ఆడి సంస్థకు చెందిన నెకార్సుల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రాబోయే ఐదేళ్ల పెట్టుబడి ప్రణాళికను సుమారు 15 శాతం మేర తగ్గించాలన్నది సీఈవో లక్ష్యంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. చైనా కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొనేందుకే సంస్థ ఈ కఠిన నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

వివరాలు

కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు..

అయితే, ఈ ప్రతిపాదనలను ఫోక్స్‌వ్యాగన్ వర్క్స్ కౌన్సిల్‌తో పాటు జర్మనీకి చెందిన ఐజీ మెటల్ కార్మిక సంఘం తీవ్రంగా వ్యతిరేకించాయి. యాజమాన్యం ఇలాంటి చర్యలకు ముందుకు వస్తే గట్టిగా ప్రతిఘటిస్తామని అవి హెచ్చరించాయి. ప్రస్తుతం కంపెనీ సుమారు 50 వేల ఉద్యోగాల కోతపై మాత్రమే దృష్టి సారించినట్లు సమాచారం. ఇదే సమయంలో, 2024లో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో వచ్చే పదేళ్ల పాటు ఏ ప్లాంట్‌ను కూడా మూసివేయబోమని ఫోక్స్‌వ్యాగన్ హామీ ఇచ్చింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తాజా ప్రతిపాదనలు ఆ ఒప్పందానికి పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement