LinkedIn: రిఫరల్ ఉంటే జాబ్ పక్కా.. ఉద్యోగం దక్కే ఛాన్స్ 8.5 రెట్లు ఎక్కువ.. లింక్డ్‌ఇన్ తాజా నివేదికలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
రిఫరల్ ఉంటే ఉద్యోగం దక్కే అవకాశం భారీగా పెరుగుతుంది. కంపెనీలో ముందుగానే పరిచయం ఉన్న వ్యక్తి (ఇన్‌సైడ్ కనెక్షన్) ద్వారా రిఫరల్ లభిస్తే.. భారత్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంపికయ్యే అవకాశాలు ఏకంగా 8.5 రెట్లు అధికంగా ఉంటాయని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ తాజా నివేదిక వెల్లడించింది. ఉద్యోగం సాధించడంలో విద్యార్హతలు, నైపుణ్యాలతో పాటు ప్రొఫెషనల్ సంబంధాలు, రిఫరల్స్ కూడా కీలకంగా మారుతున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
వివరాలు
భారత్‌లో 83 శాతం మంది జెన్-జీ నిపుణులు
నెట్‌వర్కింగ్ విషయంలో ముఖ్యంగా జెన్-జీ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ నివేదిక వెల్లడించింది.
భారత్‌లో 83 శాతం మంది జెన్-జీ నిపుణులు కొత్త వ్యక్తులతో వృత్తిపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి వెనుకాడుతున్నట్లు సర్వేలో తేలింది.
అయితే కెరీర్‌లో ఎదగడానికి నెట్‌వర్కింగ్ అవసరమేనని 79 శాతం మంది అంగీకరించారు.
అయినప్పటికీ.. ఎక్కడి నుంచి, ఎలా ప్రారంభించాలో తమకు తెలియడం లేదని 52 శాతం మంది తెలిపారు.
మరోవైపు 53 శాతం మంది తమ కాంటాక్ట్‌లను బలమైన, అర్థవంతమైన ప్రొఫెషనల్ సంబంధాలుగా మార్చుకోవడం కష్టంగా ఉందని చెప్పారు.
నెట్‌వర్కింగ్‌పై తమకు ఎవరూ సరైన మార్గదర్శకత్వం ఇవ్వలేదని 59 శాతం మంది పేర్కొనడం గమనార్హం.
వివరాలు
ఇవే నెట్‌వర్కింగ్‌కు ప్రధాన అడ్డంకులు
కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేందుకు యువత ఎందుకు వెనుకాడుతున్నారనే అంశాన్ని కూడా సర్వే పరిశీలించింది.
తమను ఎదుటివారు తప్పుగా అంచనా వేస్తారేమోనన్న భయం 44 శాతం మందిలో ఉంది.
తాము అవతలి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నామేమోనన్న భావన 39 శాతం మందిని వెంటాడుతోంది.
ఇక తాము చేస్తున్న పరిచయం సహజంగా కాకుండా కృత్రిమంగా అనిపిస్తుందేమోనని 37 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవే నెట్‌వర్కింగ్‌కు ప్రధాన అడ్డంకులుగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది.
వివరాలు
లింక్డ్‌ఇన్ సూచించిన కొన్ని మార్గాలు
ఈ సంకోచాలను అధిగమించేందుకు కొన్ని మార్గాలను లింక్డ్‌ఇన్ సూచించింది.
తమతో ఒకే విధమైన ఆసక్తులు, వృత్తిపరమైన లక్ష్యాలు ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మంచిదని తెలిపింది.
అలాగే ఎవరికైనా కనెక్షన్ రిక్వెస్ట్ పంపే ముందు వారి పోస్టులను పరిశీలించి వాటిపై స్పందించడం లేదా ఎంగేజ్ అవడం ద్వారా సహజమైన పరిచయానికి అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఉద్యోగం లేదా ఇతర అవసరం వచ్చిన తర్వాత సంబంధాలు ఏర్పరచుకోవడం కంటే.. అవసరం రాకముందే ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడం మరింత ప్రయోజనకరమని సూచించింది.
వివరాలు
భారత్ సహా 12 దేశాల్లో 18,050 మంది నిపుణులపై ఈ సర్వే
కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఉద్యోగ మార్కెట్‌లో మానవ సంబంధాలు, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్రాధాన్యం తగ్గలేదని లింక్డ్‌ఇన్ నివేదిక తేల్చింది.
సరైన వ్యక్తులతో ముందుగానే పరిచయాలు పెంచుకోవడం, వాటిని అర్థవంతమైన సంబంధాలుగా మార్చుకోవడం ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంలో కీలకంగా మారుతుందని వెల్లడించింది.
కాగా, సెన్సస్‌వైడ్ సంస్థ జూలై-ఆగస్టు 2026 మధ్య భారత్ సహా 12 దేశాల్లో 18,050 మంది నిపుణులపై ఈ సర్వే నిర్వహించింది.