Colgate: వార్ ఎఫెక్ట్.. కోల్గేట్ ఉత్పత్తుల ధరలు పెంచేందుకు సిద్దమైన కంపెనీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం వినియోగ వస్తువులపై పడుతోంది. ముడిసరుకుల సరఫరా, వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్గేట్-పామోలివ్ తన ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. రానున్న త్రైమాసికాల్లో ధరలను పెంచే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా లాభాల మార్జిన్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు ధరల పెంపు అవసరమవుతోందని కంపెనీ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
వివరాలు
ధరల పెంపు ఎందుకంటే..
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిసరుకుల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడుతోందని కోల్గేట్-పామోలివ్ సీఈవో, ఎండీ ప్రభా నరసింహన్ తెలిపారు.
''గతేడాది జీఎస్‌టీ మార్పుల నేపథ్యంలో మా ఉత్పత్తుల బరువును పెంచాం. ప్రస్తుతం కోల్గేట్ ఉత్పత్తులను రూ.10, రూ.20 ధరల నుంచే అందిస్తున్నాం. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ముడిసరుకుల సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడే ధరలను పెంచకపోతే భవిష్యత్తులో ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
ప్రీమియం ఉత్పత్తులపై ఫోకస్..
ధరల పెంపుతో పాటు టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్ విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులను మరింతగా అభివృద్ధి చేయడంపై కంపెనీ దృష్టి సారిస్తోంది.
వినియోగదారులకు అధిక విలువను అందించే ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కోల్గేట్-పామోలివ్ భావిస్తోంది.
వివరాలు
పామోలివ్ మార్కెట్‌పై అసంతృప్తి..
మరోవైపు, కోల్గేట్-పామోలివ్‌కు చెందిన పర్సనల్ కేర్ బ్రాండ్ పామోలివ్ మార్కెట్ పనితీరుపై ప్రభా నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో బ్రాండ్ స్థాయిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలో పామోలివ్ ఉత్పత్తుల మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు బాంబే షేవింగ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం పామోలివ్ ఉత్పత్తులు పతంజలి, హేలియోన్ కంపెనీకి చెందిన సెన్సోడైన్, హిందుస్థాన్ యునిలీవర్‌కు చెందిన పెప్సోడెంట్ వంటి బ్రాండ్ల నుంచి పోటీని ఎదుర్కొంటున్నాయి.
మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పామోలివ్ బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసేందుకు కోల్గేట్-పామోలివ్ చర్యలు చేపడుతోంది.