Loading...
Billionaire wealth: ఏఐతో భారీగా పెరిగిన సంపద.. 3,800కు చేరిన బిలియనీర్ల సంఖ్య
ఏఐతో భారీగా పెరిగిన సంపద.. 3,800కు చేరిన బిలియనీర్ల సంఖ్య

Billionaire wealth: ఏఐతో భారీగా పెరిగిన సంపద.. 3,800కు చేరిన బిలియనీర్ల సంఖ్య

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) కారణంగా ఒకవైపు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంటే.. మరోవైపు ఇదే రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద పెద్ద కంపెనీలు భారీగా సంపదను సృష్టిస్తున్నాయి. ఏఐ రంగంలో పెట్టుబడులు కలిసిరావడంతో ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య దాదాపు 3,800కు చేరినట్లు గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ అల్ట్రాటా (Altrata) తన వెల్త్ రిపోర్ట్‌లో వెల్లడించింది. వీరందరి మొత్తం సంపద సుమారు 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.1,417.37 లక్షల కోట్లకు సమానం.

వివరాలు

అధిక మార్కెట్ విలువను సాధించాయి

ఐదేళ్లలో ఏఐ రంగంలో సగటున 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.283.25 కోట్లు) వరకు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు అధిక మార్కెట్ విలువను సాధించినట్లు అల్ట్రాటా తన నివేదికలో పేర్కొంది.

ఫలితంగా బిలియనీర్ల మొత్తం సంపద 12.8 శాతం పెరగ్గా.. కుబేరుల సంఖ్య 8.2 శాతం ఎగబాకింది.

ముఖ్యంగా ఏఐ రంగానికి సంబంధించిన టెక్నాలజీ స్టాక్స్‌లో పెట్టుబడులు భారీగా సంపదను సృష్టించినట్లు నివేదిక వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరుల మొత్తం సంపదలో 27 శాతం కేవలం 29 మంది సూపర్ బిలియనీర్ల వద్దే ఉన్నట్లు తెలిపింది.

వివరాలు

1,081 మంది కుబేరులతో ఐరోపా రెండో స్థానం

50 బిలియన్ డాలర్లకు మించి ఆదాయం ఉన్న వారిని సూపర్ బిలియనీర్లుగా పరిగణిస్తారు.

ప్రాంతాల వారీగా చూస్తే అత్యధికంగా 1,337 మంది బిలియనీర్లతో ఉత్తర అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. 1,081 మంది కుబేరులతో ఐరోపా రెండో స్థానంలో ఉంది.

ఇక ఆసియాలో 881 మంది బిలియనీర్లు ఉన్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సంపన్నుల్లో మహిళల వాటా కేవలం 13 శాతం మాత్రమే ఉండడం గమనార్హం.

ఏఐ రంగంలో పెట్టుబడులు, టెక్నాలజీ స్టాక్స్‌ విలువ పెరగడం వంటి అంశాలు కుబేరుల సంపద వృద్ధికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది.

ADVERTISEMENT