NSE IPO: దశాబ్దం తర్వాత NSE ఐపీఓకు లైన్ క్లియర్.. సెబీ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు రూ.30 వేల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఎన్‌ఎస్‌ఈకి మార్గం సుగమమైంది. జూన్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించిన ఎన్‌ఎస్‌ఈకి.. శుక్రవారం నియంత్రణ సంస్థ ఆమోద ముద్ర వేసింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ధరల శ్రేణి, ఇతర కీలక వివరాలను సెప్టెంబర్ 15న వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాలు
దశాబ్దం తర్వాత ఐపీఓకు అడుగులు
ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూ దాదాపు పదేళ్ల క్రితమే రావాల్సి ఉంది. అయితే కో-లొకేషన్ వివాదం కారణంగా పబ్లిక్ ఇష్యూకు ఇంతకాలం వేచి చూడాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి సెబీ నుంచి కూడా అనుమతి లభించడంతో నిధుల సమీకరణకు ఎన్‌ఎస్‌ఈ సన్నాహాలు ప్రారంభించనుంది.
ఈ ఐపీఓ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూపంలో ఉండనుంది. ప్రస్తుత వాటాదారులు తమ వాటాల్లో 6 శాతానికి సమానమైన మొత్తం 14.89 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక్కటే 2.48 కోట్ల షేర్లను విక్రయించనుంది.
వివరాలు
హ్యుందాయ్ రికార్డుపై కన్ను
ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.5 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఐపీఓ ద్వారా దాదాపు రూ.30 వేల కోట్లను సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అదే జరిగితే ఇప్పటివరకు భారత్‌లో నమోదైన అతిపెద్ద ఐపీఓగా ఉన్న హ్యుందాయ్ రూ.27,870 కోట్ల రికార్డును ఎన్‌ఎస్‌ఈ అధిగమించే అవకాశం ఉంది.
మరోవైపు టెలికాం రంగానికి చెందిన జియో కూడా పబ్లిక్ ఇష్యూకు రావడానికి సిద్ధమవుతోంది.
ఆ సంస్థ సుమారు రూ.37 వేల కోట్లను సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశీయ మార్కెట్‌లో భారీ స్థాయి ఐపీఓలపై ఆసక్తి మరింత పెరిగింది.