Loading...
Tata Chemicals: 'మనం ఇతరులకు బానిసలమా?'.. టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
'మనం ఇతరులకు బానిసలమా?'..

Tata Chemicals: 'మనం ఇతరులకు బానిసలమా?'.. టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
09:28 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా కెమికల్స్‌కు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో షాక్ ఇచ్చారు. కెన్యాలోని లేక్ మగాడి ప్రాంతంలో టాటా కెమికల్స్ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. దేశంలోని సహజ వనరులను సంస్థ వినియోగించుకుంటున్నప్పటికీ, స్థానికులకు తగిన స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి కల్పించడం లేదని రూటో ఆరోపించారు. టాటాకు దాదాపు 100 ఏళ్ల కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ.. కాజియాడో ప్రాంతంలో పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ''మనం ఇతరులకు బానిసలమా?'' అంటూ ప్రశ్నించిన ఆయన.. లేక్ మగాడి నుంచి వనరులను ఇతర దేశాలకు తరలించకుండా, కెన్యాలోనే వాటిని ప్రాసెస్ చేయాలని స్పష్టం చేశారు. తద్వారా స్థానికంగా ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

టాటా కెమికల్స్‌కు బదులుగా కొత్త పరిశ్రమలు 

టాటా కెమికల్స్‌కు బదులుగా కొత్త పరిశ్రమలను తీసుకురావాలని కెన్యా ప్రభుత్వం యోచిస్తోంది.

కాజియాడో ప్రాంతంలోనే కొత్త కంపెనీలు తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని రూటో తెలిపారు.

ఇందులో ఒక సంస్థ గాజు తయారీ పరిశ్రమను, మరో సంస్థ కెమికల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

1911లో ప్రారంభమైన కార్యకలాపాలు

లేక్ మగాడిలో టాటా కెమికల్స్ కార్యకలాపాలు 1911లో 'మగాడి సోడా కంపెనీ' పేరుతో ప్రారంభమయ్యాయి.

అనంతరం 2005లో టాటా కెమికల్స్ ఈ సంస్థను కొనుగోలు చేసింది.

అప్పటి నుంచి లేక్ మగాడిలోని ట్రోనా ఖనిజాన్ని వెలికితీసి సహజ సోడా యాష్‌ను ఉత్పత్తి చేస్తోంది.

గాజు,డిటర్జెంట్లు,వివిధ రకాల రసాయనాల తయారీలో సోడా యాష్‌ను విస్తృతంగా ఉపయోగిస్తారు.

నీటి శుద్ధి ప్రక్రియలోనూ దీనికి వినియోగం ఉంది. ఈ కార్యకలాపాల ద్వారా కెన్యా నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు కూడా జరుగుతున్నాయి.

అయితే కెన్యా ప్రభుత్వం జూలై 28 నుంచి టాటా కెమికల్స్ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేసింది.

దీనిపై సంస్థ స్పందిస్తూ.. ప్రభుత్వం కోరిన సమాచారం,అవసరమైన పత్రాలన్నింటినీ తాము సమర్పించామని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

నిర్ణయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షం

తాము నిబంధనలకు అనుగుణంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని టాటా కెమికల్స్ స్పష్టం చేసింది.

రూటో నిర్ణయాన్ని కెన్యా ప్రతిపక్ష పార్టీ 'డెమోక్రసీ ఫర్ ది సిటిజన్ పార్టీ' (డీసీపీ) తీవ్రంగా వ్యతిరేకించింది.

టాటా కెమికల్స్ కార్యకలాపాలు మూసివేస్తే మగాడి ప్రాంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మందిపై ప్రభావం పడుతుందని ఆ పార్టీ పేర్కొంది.

మగాడి ప్రాంతంలో భారీ స్థాయిలో లిథియం నిల్వలు ఉన్నాయని, చమురు అన్వేషణకు కూడా అవకాశాలు ఉన్నాయని డీసీపీ తెలిపింది.

టాటా కెమికల్స్‌ను ప్రాంతం నుంచి పంపించి.. అక్కడి సహజ వనరులను ఇతర సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

ADVERTISEMENT