Loading...
Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం
ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం

Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పరిశ్రమలే ఉద్యోగులకు శిక్షణ అందించడం, పరీక్షలు నిర్వహించి వారి నైపుణ్యాలను మదింపు చేయడం, కేంద్ర సంస్థ భాగస్వామ్యంతో సర్టిఫికెట్లు జారీ చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా 50 పరిశ్రమల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఫ్యాక్టరీస్‌ విభాగం నిర్ణయించింది. ఇందుకోసం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 80 పరిశ్రమలను అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 49 పరిశ్రమలు శిక్షణ, పరీక్షల నిర్వహణకు ముందుకొచ్చాయి. మొదటి దశలో కనీసం 25 పరిశ్రమలతో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

వివరాలు

అంతర్జాతీయ గుర్తింపు పొందే సర్టిఫికెట్లు

ఈ విధానం జాతీయ నైపుణ్య అర్హత ఫ్రేమ్‌వర్క్‌ (NSQF)కు అనుగుణంగా ఉంటుంది.

జాతీయ వృత్తి విద్య, శిక్షణ మండలి (NCVET) భాగస్వామ్యంతో పరిశ్రమలు సర్టిఫికెట్లు జారీ చేస్తాయి.

లెవల్‌ 3, 4 కింద అందించే సర్టిఫికెట్లకు పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ అర్హతలకు సమాన గుర్తింపు ఉంటుంది.

లెవల్‌ 4.5 నుంచి 5.5 వరకు ఇచ్చే సర్టిఫికెట్లు డిప్లొమాకు సమానంగా పరిగణిస్తారు.

ఈ సర్టిఫికెట్లను ఎన్‌సీవీఈటీ జారీ చేయనుంది. వీటికి అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించనుంది.

వివరాలు

పరిశ్రమలే శిక్షణ ఇచ్చేలా..

ముందుగా పరిశ్రమలు ఎన్‌సీవీఈటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత పరిశ్రమలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, శిక్షణకు అనువైన పరిస్థితులను ఎన్‌సీవీఈటీ అధికారులు పరిశీలిస్తారు.

రిజిస్ట్రేషన్‌ కోసం ప్రతి కర్మాగారం గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 49 పరిశ్రమలు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాయి.

ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత కలిగిన ఉద్యోగులకు ఎన్‌సీవీఈటీ తొలుత శిక్షణ అందిస్తుంది. అనంతరం వారిని సర్టిఫైడ్‌ శిక్షకులుగా గుర్తిస్తుంది.

ఫ్యాక్టరీల చట్టం ప్రకారం పరిశ్రమల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే ఉద్యోగులకు నిర్దిష్ట విద్యార్హతలు, నైపుణ్యాలు ఉండాలి.

ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి అవసరమైన అర్హతలు లేకపోతే.. ఆయా ఉద్యోగులకు పరిశ్రమలే శిక్షణ అందించే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

విదేశాల నుంచి ఆధునిక యంత్రాలను దిగుమతి

పరిశ్రమలు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు పరీక్షలు నిర్వహించి వారి సామర్థ్యాన్ని మదింపు చేస్తాయి. అనంతరం ఎన్‌సీవీఈటీతో కలిసి సర్టిఫికెట్లను జారీ చేస్తాయి.

ఐటీఐ, సర్టిఫికెట్‌ కోర్సుల స్థాయి వరకు పరిశ్రమలకు శిక్షణ, ధ్రువీకరణకు ఎన్‌సీవీఈటీ అనుమతులు ఇవ్వనుంది.

కొన్ని పరిశ్రమలు విదేశాల నుంచి ఆధునిక యంత్రాలను దిగుమతి చేసుకుంటున్నాయి.

వాటిపై పనిచేసేందుకు అవసరమైన విద్యార్హతలు, నైపుణ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. పరిశ్రమలే ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి, అవసరమైన నైపుణ్యాలను అందించి, సర్టిఫికెట్‌ ప్రదానం చేసే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది.

ADVERTISEMENT