
Anant Ambani: రిలయెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వేతనం ఏడాదికి ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఇటీవల నియమితులైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జీతభత్యాల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మే 1 నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంత్, ఈ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. రిలయన్స్ షేర్‌హోల్డర్లకు పంపిన నోటీసులో పేర్కొన్నట్లుగా, అనంత్‌కు రూ.10 నుంచి రూ.20 కోట్ల మధ్య వార్షిక వేతనం లభించనుంది. జీతం, ప్రయాణ భత్యాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, వసతి, భద్రత వంటి ప్రయోజనాలుతో పాటు కంపెనీ లాభాల ఆధారంగా ప్రోత్సాహకాలు కూడా కలిపి ఈ మొత్తం చెల్లించనున్నారు. 2023లో ముకేశ్ అంబానీ వారసత్వ బాధ్యతల పంపిణీగా తన ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్, అనంత్‌లను RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించారు.
Details
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంత్ అంబానీ
నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్న సమయంలో వారెవరూ జీతం పొందలేదు. అయితే సమావేశాల్లో పాల్గొన్నందుకు రూ.4 లక్షల చొప్పున సిట్టింగ్ ఫీజు, రూ.97 లక్షల మేర లాభాలపై కమిషన్‌గా అందుకున్నారు. ఈ క్రమంలో, 2025 ఏప్రిల్ నుంచి అనంత్ అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని వీడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ఆయన జీతభత్యాలను అధికారికంగా ప్రకటించింది. అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ప్రస్తుతం సంస్థ ఇంధన వ్యాపార విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ముకేశ్ అంబానీ వారసుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి వ్యక్తి అనంతే కావడం విశేషం.