LOADING...
8th Pay Commission: రంజనా దేశాయ్ నుంచి పంకజ్ జైన్ వరకు.. సభ్యుల పూర్తి వివరాలు
రంజనా దేశాయ్ నుంచి పంకజ్ జైన్ వరకు.. సభ్యుల పూర్తి వివరాలు

8th Pay Commission: రంజనా దేశాయ్ నుంచి పంకజ్ జైన్ వరకు.. సభ్యుల పూర్తి వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల వేతనాలు,అలవెన్సులు,ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే 8వ వేతన సంఘం (8th Central Pay Commission - CPC) పనులను వేగవంతం చేసింది. ప్రతి పదేళ్లకోసారి ఏర్పాటు చేసే ఈ కమిషన్ సిఫార్సుల వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 50లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65లక్షల మంది పెన్షనర్లు,వీరిలో రైల్వే, రక్షణ శాఖ ఉద్యోగులు,మాజీ సైనికులు కూడా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే కమిషన్ ప్రజలు,ఉద్యోగ సంఘాలు,ఇతర భాగస్వాముల నుంచి సూచనలు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించింది. జూన్ 15తో సూచనల స్వీకరణ ముగియగా, సంబంధిత డేటాను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. కమిషన్ తుది సిఫార్సులు 2027 మధ్య నాటికి వెలువడే అవకాశం ఉంది.

వివరాలు 

ఛైర్‌పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఎవరు?

8వ వేతన సంఘానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. 1949 అక్టోబర్ 30న ముంబైలో జన్మించిన ఆమె ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో డిగ్రీ, గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1973లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం బాంబే హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 1996లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. పదవీ విరమణ అనంతరం విద్యుత్ అప్పీళ్ల ట్రైబ్యునల్, ఆదాయపు పన్ను అడ్వాన్స్ రూలింగ్ అథారిటీకి ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

వివరాలు 

మెంబర్ సెక్రటరీ పంకజ్ జైన్

2020 నుంచి 2022 వరకు భారత డీలిమిటేషన్ కమిషన్‌కు నాయకత్వం వహించి, జమ్మూకశ్మీర్ తుది డీలిమిటేషన్ నివేదికను రూపొందించారు. అనంతరం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు. 8వ వేతన సంఘం మెంబర్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ నియమితులయ్యారు. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన ఆయనకు 35ఏళ్లకు పైగా పరిపాలనా అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో వ్యయ,సమాచార సాంకేతికత,విద్యుత్,గ్రామీణాభివృద్ధి వంటి శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్రంలో పెట్రోలియం,సహజ వాయువు శాఖ కార్యదర్శిగా,ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. బ్యాంకింగ్, ఇంధనం, బయోఫ్యూయల్స్, ఆర్థిక రంగాల్లో విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్‌బీఐ ఎంఎస్‌ఎంఈ నిపుణుల కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.

Advertisement

వివరాలు 

పార్ట్‌టైమ్ సభ్యుడు ప్రొఫెసర్ పులక్ ఘోష్

8వ వేతన సంఘంలో పార్ట్‌టైమ్ సభ్యుడిగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ ఉన్నారు. ఆయన ఐఐఎం బెంగళూరులో ఫైనాన్స్, డెసిషన్ సైన్స్, పబ్లిక్ పాలసీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ ఉన్నారు. నీతి ఆయోగ్ సీనియర్ ఫెలో, జాతీయ గణాంక కమిషన్ సభ్యుడు,సెబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ ఛైర్మన్ వంటి పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2018 ఉపాధి నివేదిక తయారీలో, 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక అంతర్జాతీయ పరిశోధన పత్రాలను ప్రచురించారు.

Advertisement

వివరాలు 

త్వరలో రాష్ట్రాల పర్యటనలు

8వ వేతన సంఘం వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు, ఇతర వర్గాలతో సమావేశాలు నిర్వహించనుంది. జూన్ 22, 23 తేదీల్లో లక్నోలో, జూలై 6, 7 తేదీల్లో భువనేశ్వర్‌లో, జూలై 9, 10 తేదీల్లో కోల్‌కతాలో చర్చలు జరపనుంది. ఈ సమావేశాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాలను సేకరించి తుది సిఫార్సుల రూపకల్పన చేపట్టనుంది.

Advertisement