John Ternus: ఖాళీ ప్రొఫైల్ నుంచి సీఈవో వరకూ.. జాన్ టర్నస్ అద్భుత ప్రస్థానం
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగాలు మారుతూ వేగంగా కెరీర్‌లో ముందుకు సాగాలని చాలా మందికి ఉంటుంది. అందుకే తమ ప్రొఫైళ్లను ఆకర్షణీయంగా రూపొందించుకోవడానికి ఎంతో శ్రద్ధ చూపుతారు. అయితే జాన్ టర్నస్ మాత్రం పూర్తిగా భిన్నం. తాను చేరిన తొలి సంస్థలోనే 25 సంవత్సరాలు కొనసాగుతూ, మరో సంస్థలోకి మారాలన్న ఆలోచన లేకుండా తన ప్రొఫైల్‌ను ఖాళీగా ఉంచారు. అయినప్పటికీ, కెరీర్‌లో వేగంగా ఎదిగి ప్రపంచంలో అత్యంత విలువైన రెండో సంస్థగా గుర్తింపు పొందిన Apple Inc. కు సీఈవోగా ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం సంస్థ సీఈవోగా ఉన్న టీమ్ కుక్ సుమారు 15 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించి, ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
వివరాలు
తొలి ఉద్యోగంలోనే 25 ఏళ్లు కొనసాగి..
ఈ నేపథ్యంలో హార్డ్‌వేర్ విభాగం నుంచి ఎదిగిన జాన్ టర్నస్‌కు సీఈవో పదవి దక్కింది. ప్రస్తుతం ఆయన అదే విభాగంలో ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. జాన్ టర్నస్ 2001లో సంస్థలో చేరారు. మాక్ కంప్యూటర్లు, ఐపాడ్ పరికరాలు, ఎయిర్ పాడ్స్ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. కానీ, ఓ వ్యక్తి తాను చేరిన తొలి ఉద్యోగంలోనే 25 ఏళ్లు కొనసాగి.. మరో కంపెనీ మారే ఉద్దేశమే లేదన్నట్లు లింక్డిన్ ప్రొఫైల్‌నే బ్లాంక్‌గా వదిలేశాడు. సంస్థ ఆదాయంలో పెద్ద భాగం తీసుకొచ్చే పరికరాల తయారీ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతోంది. ముఖ్యంగా మాక్ పరికరాల్లో స్వంత చిప్‌లను వినియోగించే ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించడంతో విక్రయాలు మళ్లీ పెరిగాయి.
వివరాలు
ముందుగానే సంకేతాలు
ప్రస్తుతం టర్నస్ వయసు 50 సంవత్సరాలు. సంస్థలోని పలువురు సీనియర్ అధికారులతో పోలిస్తే ఆయన తక్కువ వయస్కుడు. ఆసక్తికరంగా, టిమ్ కుక్ కూడా సీఈవో బాధ్యతలు చేపట్టినప్పుడు ఇదే వయసులో ఉన్నారు. కొన్ని నెలలుగా సంస్థలో మార్పులపై సంకేతాలు కనిపించాయి. టిమ్ కుక్ పదవీ విరమణపై ప్రచారం సాగుతుండగా, టర్నస్ కీలక అధికారులతో కలిసి విదేశీ కార్యాలయాలను సందర్శిస్తూ బృందాలతో సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా కొత్త పరికరాల ఆవిష్కరణ కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుండటం గమనార్హం. ఇవి సాధారణంగా సీఈవో నిర్వహించే కార్యక్రమాలు కావడంతో సంస్థ ఆయనపై నమ్మకం ఉంచినట్లు స్పష్టమైంది.
వివరాలు
హార్డ్‌వేర్ దిశగా అడుగులు
టర్నస్ నియామకంతో సంస్థ మళ్లీ పరికరాల అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. స్టీవ్ జాబ్స్ కాలంతో పోలిస్తే, టిమ్ కుక్ నాయకత్వంలో సృజనాత్మకత తగ్గిందన్న విమర్శలు వినిపించాయి. అయితే టర్నస్ మాత్రం కొత్త పరికరాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తాడని భావిస్తున్నారు. ఆయన బృందం రూపొందించిన తాజా నమూనాల్లో సన్నని రూపకల్పన కలిగిన ఫోన్‌లు, కొత్త తరహా కంప్యూటర్లు ఉన్నాయి. భవిష్యత్తులో మడతపెట్టే ఫోన్‌లను తీసుకురావాలన్న యోచన కూడా ఉందని ప్రచారం సాగుతోంది. అది నిజమైతే 2007 తర్వాత సంస్థలో అతిపెద్ద మార్పుగా నిలుస్తుంది. ఇప్పటికే 50 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసిన ఈ సంస్థ, కొత్త సాంకేతికతలపై దృష్టి పెట్టి మరింత ముందుకు వెళ్లనుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు.