Auto Stocks Crash: ఆటో స్టాక్స్‌లో భారీ పతనం.. ఐషర్, టాటా, బజాజ్ షేర్లు ఎందుకు పడిపోయాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో భారత ఈక్విటీ మార్కెట్లు బుధవారం ఉదయం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు పతనమవడం మొదలై.. సమయం గడిచేకొద్దీ నష్టాలు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సంక్షోభం ముదరడం, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, బాండ్ రాబడులు పెరగడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల బాట పట్టాయి.
వివరాలు
భారీగా పడిపోయిన నిఫ్టీ-50 షేర్లు
ఉదయం 10:26 గంటలకు నిఫ్టీ-50లోని పలు ప్రముఖ కంపెనీల షేర్లు గణనీయంగా నష్టపోయాయి.
ఆటో రంగానికి చెందిన ఐషర్ మోటార్స్ షేరు 4శాతం క్షీణించింది. ఒక్కో షేరు రూ.313 మేర తగ్గి రూ.7,657 వద్ద ట్రేడైంది.
మరో వాహన దిగ్గజం బజాజ్ ఆటో షేరు 2.78 శాతం పడిపోయింది. రూ.343 నష్టంతో రూ.12,018 వద్ద ట్రేడైంది.
విమానయాన రంగంలోని ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) షేరు 2.52శాతం తగ్గింది.
రూ.127 మేర నష్టపోయి రూ.4,925వద్దకు చేరింది. ఆర్థిక సేవల సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్ 2.11 శాతం క్షీణించి రూ.1,037 వద్ద ట్రేడైంది.
పెయింట్ల రంగంలోని ఏషియన్ పెయింట్స్ 2.02శాతం నష్టపోయి రూ.2,524 వద్ద కొనసాగింది. మార్కెట్ ప్రారంభ దశలోనే ఇవి ప్రధాన నష్టాల్లో నిలిచాయి.
వివరాలు
మంచి అమ్మకాలున్నా ఆటో షేర్లకు దెబ్బ
ఆగస్టులో ఆటో కంపెనీల అమ్మకాల గణాంకాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఐషర్ మోటార్స్,బజాజ్ ఆటో,టాటా మోటార్స్, బాష్ షేర్లు పడిపోవడం గమనార్హం.
ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు ఆగస్టులో 11 శాతం పెరిగి 1.26 లక్షల యూనిట్లకు చేరాయి.
వీఈ కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు కూడా 17.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
బజాజ్ ఆటో విక్రయాలు 28శాతం పెరిగి 5.35లక్షల యూనిట్లను దాటాయి. అయినప్పటికీ ఈ కంపెనీల షేర్లలో పతనం కనిపించింది.
దీనికి ప్రధాన కారణం.. గత కొన్ని నెలల్లో ఆయా షేర్లు ఇప్పటికే 20 నుంచి 30 శాతం వరకు పెరగడమే.
వివరాలు
ఇండిగోపై క్రూడ్ ధరల ప్రభావం
మంచి అమ్మకాల వంటి సానుకూల అంశాలు షేర్ ధరల్లో ముందుగానే ప్రతిఫలించాయని భావించిన ఇన్వెస్టర్లు లాభాలను అందిపుచ్చుకునేందుకు విక్రయాలకు మొగ్గుచూపారు. మార్కెట్ పరిభాషలో ఈ విధానాన్ని 'సెల్-ఆన్-న్యూస్' అంటారు.
ముడి చమురు ధర బ్యారెల్‌కు 95 డాలర్లను దాటడం విమానయాన రంగానికి ఆందోళన కలిగిస్తోంది.
చమురు ధర పెరగడంతో విమాన ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) వ్యయం పెరిగే అవకాశం ఉంది.
దీంతో విమానయాన సంస్థల లాభాల మార్జిన్లు తగ్గుతాయనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రభావంతో ఇండిగో షేరు అమ్మకాల ఒత్తిడికి గురైంది.
వివరాలు
పెయింట్స్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపైనా భారం
ముడి చమురు ధరల పెరుగుదల ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా వంటి సంస్థలకు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.
పెయింట్ల తయారీలో ఉపయోగించే క్రూడ్ ఆధారిత రసాయనాల ధరలు పెరగడంతో పాటు.. ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉంది.
దీంతో ఈ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరగవచ్చన్న భయాలు షేర్లపై ప్రభావం చూపాయి.
వివరాలు
వడ్డీ రేట్ల ప్రభావంతో ఆర్థిక, రియల్టీ షేర్లు
వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు ఆర్థిక సేవల రంగంపైనా ప్రభావం చూపాయి.
రుణాల సమీకరణ వ్యయం పెరిగే అవకాశం ఉందన్న కారణంతో శ్రీరామ్ ఫైనాన్స్ షేరు నష్టపోయింది.
మరోవైపు గృహ రుణాలపై వడ్డీ భారం పెరిగితే ఆస్తుల కొనుగోలు డిమాండ్ తగ్గవచ్చన్న ఆందోళనలు రియల్టీ రంగాన్ని ప్రభావితం చేశాయి. దీంతో డీఎల్ఎఫ్ షేరు కూడా క్షీణించింది.
వివరాలు
ప్రస్తుత పతనానికి అసలు కారణం ఏమిటి?
ప్రస్తుతం మార్కెట్లలో కనిపిస్తున్న ఈ ఒత్తిడికి ఆయా కంపెనీల వ్యాపార మూలాలు బలహీనపడటం ప్రధాన కారణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలు, బాండ్ రాబడులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి బాహ్య అంశాలే మార్కెట్‌పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.
అందువల్ల ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై హడావుడిగా నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
బలమైన ప్రాథమిక అంశాలు, మంచి వ్యాపార పునాదులు ఉన్న ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పారిశ్రామిక రంగాల షేర్లలో ధరలు తగ్గినప్పుడు ఒకేసారి కాకుండా దశలవారీగా పెట్టుబడులు పెంచుకోవడాన్ని విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.