Financial Stability: జీతం పెరిగినా పొదుపు చేయలేకపోవడానికి కారణాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ చాలా మంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సంపాదిస్తేనే భవిష్యత్తు భద్రంగా మారుతుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి కేవలం అధిక ఆదాయం మాత్రమే ఆర్థిక భద్రతకు హామీ కాదు. సంపాదనను సరిగ్గా వినియోగించుకోవడం, ఖర్చులను నియంత్రించడం, పొదుపు-పెట్టుబడులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటమే నిజమైన ఆర్థిక స్థిరత్వానికి దారి తీస్తుంది. ఆదాయం పెరిగిన తర్వాత చాలా మందిలో జీవనశైలిని మార్చుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. సమాజంలో మరింత ఉన్నత స్థాయిలో కనిపించాలనే కోరికతో కొత్త ఖర్చులను స్వయంగా పెంచుకుంటారు. అయితే ఇవి చాలా సందర్భాల్లో అవసరాలు కాకుండా కోరికలే అవుతాయి. ఇలాంటి తాత్కాలిక ఆశలు భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.
వివరాలు
కోరికలు
ప్రస్తుతం చాలా కుటుంబాలపై విద్యా రుణాలు, గృహ రుణాలు,వాహన రుణాలు,క్రెడిట్ కార్డు బకాయిల భారం నిశ్శబ్దంగా పెరుగుతోంది. జీతం పెరిగిన వెంటనే ఆ అదనపు ఆదాయం పొదుపులకు మళ్లకుండా, కొత్త ఖర్చులకు వెళ్లిపోతోంది. ఎక్కువ అద్దె ఉన్న ఇళ్లకు మారడం, కొత్త స్మార్ట్ ఫోన్లు కొనడం, వాహనాలు మార్చడం, ఇంటికి కొత్త గృహోపకరణాలు తెచ్చుకోవడం, బయట భోజనాలకు అలవాటు పడడం వంటి మార్పులు ఖర్చులను పెంచుతున్నాయి. దీంతో పెరిగిన ఆదాయం సంపద సృష్టికి కాకుండా ఈఎంఐలు, విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించడానికే సరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది బోనస్‌లు, జీతాల పెంపును అదనపు నగదుగా భావించి విచక్షణ లేకుండా ఖర్చు చేస్తున్నారు. ఈ ఆలోచనే పొదుపు, పెట్టుబడుల లక్ష్యాల నుంచి దృష్టి మళ్లిస్తోంది.
వివరాలు
ఖర్చులు
ఇక చిన్న చిన్న నెలసరి చందాలు కూడా పెద్ద భారం అవుతున్నాయి. వినోద వేదికలు, ఆరోగ్య సంబంధిత యాప్'లు ,విద్యా సేవలు, ఆహార సరఫరా సేవలు వంటి వాటికి చెల్లించే సబ్‌స్క్రిప్షన్లు విడిగా చూస్తే చిన్న మొత్తాల్లా అనిపించినా, మొత్తం కలిపితే గణనీయమైన వ్యయం అవుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ ఈ తరహా పునరావృత ఖర్చులు కూడా పెరిగి, తెలియకుండానే సంపాదనలో పెద్ద భాగాన్ని తీసుకుపోతున్నాయి. అందుకే ఆదాయం ఎంత వస్తుందన్నదికంటే, అందులో ఎంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకుంటున్నామన్నదే ముఖ్యమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సరైన పొదుపు,పెట్టుబడి ప్రణాళిక లేకపోతే అదనపు ఆదాయం తాత్కాలిక సౌకర్యాలకే పరిమితమైపోతుంది. కాలక్రమంలో జీవనశైలి వ్యయాలు పెరగడంతో సంపాదన పెరిగిన ప్రయోజనం కూడా కనిపించకుండా పోవచ్చు.
వివరాలు
ఖర్చులు
జీతం పెరిగిన ప్రతిసారీ కొన్ని ఆర్థిక నియమాలు పాటించడం అవసరం. ఉదాహరణకు నెలకు రూ.10 వేల అదనపు ఆదాయం వస్తే, అందులో కనీసం సగం మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు కేటాయించడం మంచిది. మిగిలిన మొత్తాన్ని అవసరమైన ఖర్చులు, ఈఎంఐలకు ఉపయోగించాలి. అలాగే జీతం ఖాతాలో జమ అయిన వెంటనే సిప్‌లు, స్వచ్ఛంద భవిష్య నిధి, జాతీయ పెన్షన్ పథకం వంటి పెట్టుబడి ఖాతాలకు ఆటోమేటిక్ బదిలీలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే పెరిగిన ఆదాయాన్ని అనవసర ఖర్చులకు వినియోగించే అవకాశం తగ్గుతుంది.
వివరాలు
నేర్చుకోవాల్సిన పాఠం
ప్రతి జీతం పెంపుతో సిప్ మొత్తాన్ని 10 నుంచి 15శాతం వరకు పెంచడం కూడా దీర్ఘకాలిక సంపద సృష్టికి ఉపయోగపడుతుంది. చిన్న మొత్తాల పెంపు కూడా కాలక్రమంలో చక్రవడ్డీ ప్రభావంతో పెద్ద నిధిగా మారుతుంది. అదనపు ఆదాయంతో అత్యవసర నిధిని కూడా సిద్ధం చేసుకోవాలి. కనీసం ఆరు నెలల ఇంటి ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేందుకు సరిపడే మొత్తం ఈ నిధిలో ఉండేలా చూసుకోవాలి. ఆర్థిక విజయం అంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు. సక్రమమైన పొదుపు, సమర్థవంతమైన పెట్టుబడి ప్రణాళిక, అత్యవసర నిధి, తగిన బీమా రక్షణ, నియంత్రణలో ఉండే రుణాలు కలిగి ఉండటం నిజమైన ఆర్థిక భద్రతకు పునాది. దీర్ఘకాలిక సంపదను నిర్మించుకుంటూ మనశ్శాంతితో జీవించగలగడమే అసలైన ఆర్థిక విజయం.