Loading...
Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?
భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?

Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ తయారీ కంపెనీలు ముడి పదార్థాలు, విడిభాగాలను తరలించేందుకు క్రమంగా ఎయిర్ ఫ్రైట్‌ను ఆశ్రయిస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో సముద్ర మార్గంలో సరకు రవాణాలో ఆలస్యం, పోర్టుల్లో రద్దీ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా మారింది. దీంతో సముద్ర రవాణా అనిశ్చితంగా మారడంతో కంపెనీలు విమాన మార్గంలో సరుకులను తరలించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సాధారణంగా సముద్ర రవాణాతో పోలిస్తే ఎయిర్ ఫ్రైట్ ఖర్చు మూడు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చు తగ్గించుకోవడం కంటే ఉత్పత్తికి అవసరమైన సరఫరాలు సమయానికి అందడం ముఖ్యమని కంపెనీలు భావిస్తున్నాయి.

వివరాలు

నౌకలు అందుబాటులో లేకపోవడం మరో సమస్య..

ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, దుస్తులు, ఫ్యాషన్ వంటి రంగాల్లో పండుగ సీజన్‌ అమ్మకాలపై కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.

దీంతో ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు, విడిభాగాలు సకాలంలో అందేలా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సరఫరాల్లో ఆలస్యం జరిగితే పండుగ సీజన్‌ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నాయి.

కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఎండీ (ఆపరేషన్స్) వికాస్ గుప్తా మాట్లాడుతూ.. పండుగ సీజన్‌ ఉత్పత్తి నిలిచిపోకుండా ఉండేందుకు కొన్ని విడిభాగాలను విమాన మార్గంలో తరలించడం ప్రారంభించినట్లు తెలిపారు.

సముద్ర రవాణాకు ఎక్కువ చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరుకు రవాణా నౌకలు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు.

వివరాలు

అధిక రవాణా ఖర్చులను కంపెనీలే భరిస్తున్నాయి..

ఎయిర్ ఫ్రైట్ ఖర్చులు భారీగా ఉన్నప్పటికీ.. అమ్మకాల పునరుద్ధరణపై ప్రభావం పడకుండా ఉండేందుకు కంపెనీలు ఈ అదనపు వ్యయంలో కొంత భాగాన్ని తామే భరిస్తున్నాయి.

వుడ్‌ల్యాండ్ ఇండియా ఎండీ హర్‌కిరత్ సింగ్ మాట్లాడుతూ.. తొలుత పెరిగిన రవాణా ఖర్చులను వినియోగదారులపై మోపామని తెలిపారు.

అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కస్టమర్లు, భాగస్వామ్య సంస్థలు దీనిని పెద్దగా అంగీకరించకపోవడంతో ఆ అదనపు ఖర్చును తామే భరించాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం ఇటలీ, చైనా, వియత్నాం, దక్షిణ కొరియా నుంచి ముడి పదార్థాలను విమాన మార్గంలో భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

లాజిస్టిక్స్ సంస్థల కొత్త మార్గాలు..

సముద్ర మార్గాలపై ఇంకా ప్రభావం కొనసాగుతుండటంతో.. తయారీ కంపెనీలకు సరఫరాలు సకాలంలో చేరేలా లాజిస్టిక్స్ సంస్థలు కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి.

ఇందులో రోడ్డు, విమాన రవాణాను కలిపి ఉపయోగించడం కూడా ఉంది. ఇటీవల షార్జా పోర్టు తిరిగి తెరుచుకోవడం వల్ల రానున్న రోజుల్లో సరఫరాలు కొంత మెరుగుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గ్రీన్‌విచ్ లాజిస్టిక్స్ నార్త్ ఇండియా జీఎం అభయ్ రాణా మాట్లాడుతూ.. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి సముద్ర రవాణా, ఎయిర్ ఫ్రైట్ రెండింటి చార్జీలు పెరిగాయని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

పలు ఉత్పత్తుల ధరలు పెంపు..

కమోడిటీలు, షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది చాలా ఉత్పత్తుల కేటగిరీల్లో కంపెనీలు 5 నుంచి 20 శాతం వరకు ధరలు పెంచాయి.

ఆటోమొబైల్ రంగంలో మాత్రం ధరల పెంపు 2 నుంచి 4 శాతం మధ్య ఉంది.

ఇప్పటికే ధరలు పెరగడంతో అదనంగా పెరిగిన ఎయిర్ ఫ్రైట్ ఖర్చులను పూర్తిగా వినియోగదారులపై మోపేందుకు కంపెనీలకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది.

ADVERTISEMENT