Page Loader
Gold:భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు? 
భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు?

Gold:భారతదేశంలో కంటే దుబాయ్‌లో బంగారం ఎందుకు చౌకగా ఉంటుంది?అక్కడి నుంచి ఎంత తేవొచ్చు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 10, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం అక్రమ రవాణా గురించి వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఎయిర్‌పోర్టులో బంగారం పట్టుబడిందని, కొత్తకొత్త మార్గాల్లో దీన్ని తరలించారని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా, కన్నడ నటి రన్యా రావు దుబాయ్‌ నుంచి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నంలో బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డారు. ఈ ఘటన మరోసారి బంగారం స్మగ్లింగ్‌ విషయాన్ని హాట్‌టాపిక్‌గా మార్చింది. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా పూర్తిగా ఆగడం లేదు.

వివరాలు 

దుబాయ్ నుంచే ఎక్కువగా బంగారం తరలింపునకు కారణం: 

భారత్‌కు వెళ్లే వారు, ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే వాళ్లు, బంధువులు,స్నేహితుల దగ్గర తరచుగా "వచ్చేటప్పుడు బంగారం ఏమైనా తేవచ్చా?" అనే ప్రశ్నను ఎదుర్కొంటారు. దీని వెనుక ప్రధాన కారణం - దుబాయ్‌లో బంగారం ధర భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉండటమే. అక్కడ కొనుగోలు చేసిన బంగారం ద్వారా కొంత లాభం పొందొచ్చనే ఆశతో కొందరు చట్టబద్ధంగా కొనుగోలు చేస్తారు. అయితే మరికొందరు అధిక లాభం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. దొరికినవారు వార్తల్లో నిలుస్తారు, తప్పించుకున్నవారు వారి ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తారు.

వివరాలు 

దుబాయ్‌లో బంగారం తక్కువ ధరకే ఎందుకు లభిస్తుంది? 

భారత్‌తో పోలిస్తే దుబాయ్‌లో బంగారం తక్కువ ధరకే లభించడానికి అనేక కారణాలు ఉన్నాయి: పన్నుల లేమి - దుబాయ్‌లో బంగారం కొనుగోలుపై ఎలాంటి అదనపు పన్నులు ఉండవు. దిగుమతి సుంకం లేకపోవడం - భారత్‌లో బంగారం దిగుమతిపై అధిక శాతం సుంకం విధిస్తారు, కానీ దుబాయ్‌లో అలాంటి పరిమితులు లేవు. పోటీ ఎక్కువగా ఉండడం - దుబాయ్‌లో బంగారం వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారులకు ప్రత్యేకమైన ఆఫర్లు లభిస్తాయి. ఈ కారణాల వల్ల బంగారం అక్కడ తక్కువ ధరకే లభించడంతో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు.

వివరాలు 

అక్రమ రవాణాపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు: 

అక్రమ బంగారం రవాణాను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయాల్లో భద్రతా నియంత్రణను బలపరిచింది. అంతేకాదు, దిగుమతి సుంకాలను కూడా తగ్గించింది. 2024 బడ్జెట్‌లో, గతంలో 15%గా ఉన్న కస్టమ్స్‌ సుంకాన్ని 6%కు తగ్గించారు. దీని ఫలితంగా అప్పట్లో దేశీయంగా బంగారం ధర సుమారు ₹4,000 తగ్గింది. అయినప్పటికీ, అక్రమంగా బంగారం తరలింపును పూర్తిగా అరికట్టడం సాధ్యమవలేదు.

వివరాలు 

ఎంత వరకు బంగారం తీసుకురావచ్చు? 

భారత ప్రభుత్వం విదేశాల నుండి బంగారం తీసుకురావడానికి కొన్ని పరిమితులను విధించింది. ఆరు నెలలలోపు విదేశాల్లో ఉన్నవారు - బంగారం తీసుకురావాలంటే 38.5% కస్టమ్స్‌ సుంకం చెల్లించాలి. ఆరు నెలలకు పైగా విదేశాల్లో ఉన్నవారు - పురుషులు 20 గ్రాముల వరకు మహిళలు 40 గ్రాముల వరకు సుంకం లేకుండా తీసుకురావచ్చు. ఈ పరిమితిని మించి తీసుకురావాలంటే సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనల గురించి తెలియకపోవడం లేదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్గొట్టాలనే ఆలోచనతో కొందరు అక్రమ మార్గాలను ఎంచుకుంటూ కస్టమ్స్‌ అధికారుల చేతికి చిక్కిపోతున్నారు.