LOADING...
Xbox: లేఆఫ్‌ల జాబితాలో నా పేరూ ఉంది.. ఎక్స్‌బాక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్
లేఆఫ్‌ల జాబితాలో నా పేరూ ఉంది.. ఎక్స్‌బాక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్

Xbox: లేఆఫ్‌ల జాబితాలో నా పేరూ ఉంది.. ఎక్స్‌బాక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్‌ విభాగం ఎక్స్‌బాక్స్‌లో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల కోతలు సీనియర్‌ అధికారులనూ వదలడం లేదు. ఇప్పటికే మొత్తం 3,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించగా, 37 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్‌లో పనిచేస్తున్న ఎక్స్‌బాక్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కెవిన్‌ లాచాపెల్‌ కూడా లేఆఫ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కెవిన్‌ లింక్డిన్‌ వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

వివరాలు 

1989లో మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా

"ఎక్స్‌బాక్స్‌ లేఆఫ్‌ల జాబితాలో నా పేరు కూడా ఉంది. మైక్రోసాఫ్ట్‌తో 37ఏళ్ల అనుబంధానికి ఇవాళ ముగింపు పలుకుతున్నాను. నా కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.ముఖ్యంగా ఎక్స్‌బాక్స్‌ బ్యాక్‌వర్డ్‌ కంపాటిబిలిటీ ప్రోగ్రామ్‌ను రూపొందించిన ప్రతిభావంతులైన ఇంజినీర్ల బృందానికి నాయకత్వం వహించడం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భవిష్యత్తులో ఎక్స్‌బాక్స్‌ మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు"అని పేర్కొన్నారు. కెవిన్‌ లాచాపెల్‌ 1989లో మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం గేమింగ్‌ విభాగమైన ఎక్స్‌బాక్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వైస్‌ ప్రెసిడెంట్‌ హోదా వరకు ఎదిగారు. దాదాపు నాలుగు దశాబ్దాల సేవల అనంతరం ఆయన కూడా లేఆఫ్‌ల ప్రభావానికి గురికావడం చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

సోమవారం ఒక్కరోజే సుమారు 1,600 మంది ఉద్యోగుల తొలగింపు 

ఇక ఎక్స్‌బాక్స్‌ ప్రకటించిన 3,200 మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సోమవారం ఒక్కరోజే సుమారు 1,600 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సంస్థ వెల్లడించింది. మిగిలిన లేఆఫ్‌ల ప్రక్రియను 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రస్తుత వ్యాపార పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంస్థ పునర్వ్యవస్థీకరణ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఎక్స్‌బాక్స్‌ సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్తు వృద్ధిని దృష్టిలో ఉంచుకుని క్లిష్టమైనప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వివరించారు.

Advertisement