LOADING...
Zomato customer data: రెస్టరంట్లకు ఇక జొమాటో కస్టమర్ల డేటా.. ఎందుకీ నిర్ణయం? 
రెస్టరంట్లకు ఇక జొమాటో కస్టమర్ల డేటా.. ఎందుకీ నిర్ణయం?

Zomato customer data: రెస్టరంట్లకు ఇక జొమాటో కస్టమర్ల డేటా.. ఎందుకీ నిర్ణయం? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో ఇకపై రెస్టారెంట్లతో కస్టమర్ల వ్యక్తిగత వివరాలను పంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే మార్గాన్ని ఇతర ఫుడ్‌ డెలివరీ సర్వీసులు కూడా అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కస్టమర్‌ డేటా షేరింగ్‌పై NRAI (నేషనల్‌ రెస్టరంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా)-జొమాటో మధ్య జరుగుతున్న చర్చలు చివరకు ఏకాభిప్రాయానికి చేరడంతో, దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు లభించినట్లైంది. ఇప్పటివరకు ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఆర్డర్‌ పెట్టిన యూజర్ల వివరాలను రెస్టారెంట్లకు మాస్క్‌ చేసి, పూర్తి సమాచారాన్ని దాచేవి. ఎన్‌ఆర్‌ఏఐతో కుదిరిన ఒప్పందం మేరకు జొమాటో ఇప్పటికే కొత్త ఫీచర్‌ను పరీక్షించడం ప్రారంభించింది. ఈ వ్యవస్థలో కస్టమర్‌ అనుమతితో వారి ఫోన్‌ నంబర్లు భాగస్వామ్య రెస్టారెంట్లకు పంపబడుతున్నాయి.

వివరాలు 

ఎవరి వాదన ఏంటి? 

ఇలా అందిన నంబర్లను రెస్టారెంట్లు మార్కెటింగ్‌, ఆఫర్లు, ప్రచార సందేశాలు పంపేందుకు ఉపయోగించనున్నాయి. ఎవరు ఏమి ఆర్డర్‌ చేస్తారు? ఎంత తరచుగా చేస్తారు? వంటి వివరాలు తెలుసుకుంటే, తాము మార్కెటింగ్‌ ఖర్చును తెలివిగా వినియోగించగలమని చెబుతున్నాయి. కస్టమర్‌ రుచి, అలవాట్లు తెలుసుకుని డైరెక్ట్‌గా ఆఫర్లు పంపడం, వారి‌తో దీర్ఘకాల సంబంధం నెలకొల్పడం అన్నీ ఈ సమాచారంతో సాధ్యమవుతాయని భావిస్తున్నాయి. మరోవైపు, గతంలో ఇలాంటి డేటా షేరింగ్‌ ప్రయత్నాలకు యూజర్ల నుంచి నెగెటివ్‌ స్పందన దక్కిందని ఫుడ్‌ డెలివరీ కంపెనీలు చెబుతున్నాయి. డేటా ప్రైవసీపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేసిన ఉదాహరణలు ఉన్నాయని తెలిపాయి. అందుకే, ఇప్పుడు కస్టమర్‌ స్పష్టమైన అనుమతి ఉన్నప్పుడే సమాచారాన్ని పంచుకుంటామని జొమాటో ప్రకటించింది.

వివరాలు 

ఇప్పుడే ఎందుకు? 

ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ మార్కెట్‌లో జొమాటో - స్విగ్గీలు మధ్య పోటాపోటీ నెలకొంది. ఈ సమయంలో రాపిడో కూడా 'ఓన్లీ' అనే పేరుతో ఫుడ్‌ డెలివరీ సేవల్లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే NRAIతో డేటా షేరింగ్‌పై అగ్రిమెంట్‌ చేసుకుని, తక్కువ కమీషన్‌తో కొత్త మోడల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రెస్టారెంట్ల నుంచి వచ్చిన ఒత్తిడిలో జొమాటో ఈ కొత్త విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, స్విగ్గీ కూడా ఇదే దారిని అనుసరించే అవకాశం ఉంది. ఇరువైపులా చర్చలు కొనసాగుతున్నాయి.