LOADING...
Achyut Potdar: 'త్రీ ఇడియట్స్' నటుడు అచ్యుత్ పొత్దార్‌ కన్నుమూత 
'త్రీ ఇడియట్స్' నటుడు అచ్యుత్ పొత్దార్‌ కన్నుమూత

Achyut Potdar: 'త్రీ ఇడియట్స్' నటుడు అచ్యుత్ పొత్దార్‌ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో అనేక ముఖ్యమైన పాత్రలు పోషించిన సీనియర్‌ నటుడు అచ్యుత్ పొత్దార్ ఇకలేరు. ఆయన వయసు 91 సంవత్సరాలు. ముఖ్యంగా 'త్రీ ఇడియట్స్' చిత్రంలో ప్రొఫెసర్‌ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, హిందీతో పాటు మరాఠీ సినిమాల్లోనూ నటించారు. ఆగస్టు 18వ తేదీ సోమవారం, థానేలోని జ్యూపిటర్‌ ఆసుపత్రిలో ఆయన చివరి శ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానులు సోషల్‌ మీడియాలో ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.

వివరాలు 

మృతి కారణం ఇంకా వెల్లడికాలేదు   

కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యల కారణంగా అచ్యుత్ పొత్దార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు థానేలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడికాలేదు. మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపం వ్యక్తం చేశారు. "ఆయన డైలాగ్‌ 'అరే కహ్నా క్యా చాహ్తే హో' మా జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది" అని ఒకరు రాశారు. "ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని మరొకరు సంతాపం తెలిపారు. ఇంకొకరు.. "ఆయన అద్భుతమైన నటుడు, ఆయనను ఎప్పటికీ మరువలేం" అని పేర్కొన్నారు.

వివరాలు 

అచ్యుత్ పొత్దార్ జీవితం - ప్రయాణం 

అచ్యుత్ పొత్దార్‌ మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జన్మించారు. బాల్యం ఇండోర్‌లో గడిచింది. ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేసి, విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంక్ సాధించి మెడల్‌ అందుకున్నారు. అయన నటనా ప్రస్థానంలో 125కిపైగా బాలీవుడ్ సినిమాలు, 25 టెలివిజన్ సీరియల్స్, 26 నాటకాలు, 45 ప్రకటనల్లో నటించారు. ముఖ్యంగా క్యారెక్టర్ రోల్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఆయన 44 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కెరీర్ ఆరంభంలో రేవా, మధ్యప్రదేశ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత భారత సైన్యంలో చేరి, 1967లో కెప్టెన్‌గా రిటైర్ అయ్యారు. తరువాత ఇండియన్ ఆయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌గా దాదాపు 25 ఏళ్ల పాటు పనిచేసి, 1992లో 58 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు.

వివరాలు 

అచ్యుత్ నటించిన సినిమాలు,సీరియల్స్ 

అచ్యుత్ పొత్దార్‌ ఆక్రోష్, ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యూం ఆతా హై, అర్ధ సత్య, విజయతా, పరిం౦దా, నరసింహా, రాజు బన్ గయా జెంటిల్మన్, దమినీ - లైట్నింగ్, ధూంద్: ది ఫాగ్, ఎక్కీస్ టప్పోన్ కీ సలామీ, కర్జ్జ్, లగే రహో మున్నాభాయ్, భూత్‌నాథ్, దబాంగ్ 2, ఫెరారీ కి సవారీ వంటి ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే టెలివిజన్‌లో కూడా భారత్ ఏక్ ఖోజ్ (దూరదర్శన్), శుభ్ మంగళ్ సావధాన్, మిసెస్ తెండూల్కర్, వాఘ్లే కి దునియా, ఆహత్ సీజన్ 1, అగ్లే జనమ్ మోహే బిటియా హీ కిజో, అమితా కా అమిత్, ప్రధానమంత్రి, ఆందోళన్ వంటి అనేక సీరియల్స్‌లో కనిపించారు.