7:11 PM టీజర్ విడుదల: భూమికీ మరో గ్రహానికీ మధ్య జరిగే సైన్స్ ఫిక్షన్ కథ
ఈ మధ్య కాలంలో తెలుగులో విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ విపరీతంగా పెరగడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలు మొదలయ్యాయి. కొత్త కొత్త కాన్సెప్టులను వెండితెర మీదకు తీసుకువస్తున్నారు. కథ బాగుండి, సరిగ్గా చెప్పగలిగితే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కూడా. తాజాగా తెలుగులో ఓ ప్రయోగాత్మక సినిమా విడుదల కాబోతుంది. 7:11 PM అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, ఇంతకుముందే విడుదలైంది. వీరసింహారెడ్డి సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని, ఈ టీజర్ ను రిలీజ్ చేసాడు. టీజర్ లో వినిపించిన, నేను భూమి మీదకు వెళతాను అనే మొదటి డైలాగ్ తోనే ఇదేదో సైన్స్ ఫిక్షన్ లా ఉందేంటని అనిపిస్తుంది.
ఆసక్తిగా ఉన్న డైలాగులు
2040సంవత్సరంలో జీవిస్తున్న హీరో సడెన్ గా 1999 సంవత్సరానికి వచ్చేస్తాడు. వేరే గ్రహం నుండి భూమ్మీద సముద్రం ఒడ్డుకు దిగిన హీరో, అందరికీ 24గంటలుంటే, నాకు మాత్రం 24వారాలు గడిచాయి అనే డైలాగును చెబుతాడు. టీజర్ లో కనిపించిన దృశ్యాలు, వినిపించిన డైలాగులు ఈ సినిమాపై ఆసక్తిగా పెంచుతున్నాయి. టీజర్ చివర్లో, 7:11 PM సమయానికల్లా మీ చేతికున్న టైమర్ ని డీ యాక్టివేట్ చేసుకోలేకపోతే కార్డియాక్ అరెస్ట్ అయ్యి మీ గుండె ఆగిపోతుంది అని హీరోతో ఒక ఏలియన్ చెప్పడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో సాహస్ పగడాల, దీపికా రెడ్డి హీరో హీరోయిన్లుగ నటిస్తున్నారు. చైతన్య మాదాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను, ఆర్కస్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.